March 2, 2013

బాబ్లీ పాపం కిరణ్‌దే!

ఆయన నిర్వాకంతో తెలంగాణ ఎడారి
18 లక్షల ఎకరాలు బీడే
అయినా.. నష్టం లేదనడం ఘోరం
కృష్ణాజిల్లా పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం


బాబ్లీ ప్రాజెక్టు పాపం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వానిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. కిరణ్ నిర్వాకం వల్ల తెలంగాణ ప్రాంతంలో 18 లక్షల ఎకరాలు ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదపూడి వద్ద శనివారం పాదయాత్రను ఆయన ప్రారంభించారు. పెడసనగల్లు, వడ్డపెనుమర్రు, ఐనంపూడి, ముళ్లపూడి, హనుమంతాపురం మీదగా 12.4 కిలోమీటర్లు నడిచారు.

ఈ సందర్భంగా పెడసనగల్లు-భట్లపెనుమర్రు గ్రామాల్లో జరిగిన బహిరంగసభల్లో.. బాబ్లీపై కిరణ్, వైఎస్ ప్రభుత్వాలను తూర్పారబట్టారు. సుప్రీం తీర్పు వల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరగలేదని ప్రభుత్వం సమర్థించుకోవటం ఘోరమని దుయ్యబట్టారు. బాబ్లీపై పోరాటం చేసింది ఒక్క టీడీపీయేనని, తాను మూడు రోజులు జైలులో ఉన్నానని, తమ నాయకులపై లాఠీ దెబ్బలు పడ్డాయని గుర్తుచేశారు.

పరిపాలనే చేతగాని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ తనను రుణమాఫీ ఎలా సాధ్యమని ప్రశ్నించడం విడ్డూరమన్నారు. మూడేళ్లుగా డెల్టా ఆధునికీకరణ పేరుతో నిధులు దోచుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరిట 80 వేల కోట్లు ఖర్చుపెట్టి 8వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్, వైసీపీలు తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తికాకపోవడం వల్లే రైతులకు సాగునీటి సమస్య తలెత్తిందని చెప్పారు. ఈ విషయంలో వైఎస్‌తోపాటు రోశయ్య, కిరణ్‌కుమార్ కూడా విఫలమయ్యారని విమర్శించారు.

కత్తితో వృద్ధుడి హల్‌చల్
చంద్రబాబు శిబిరంలో ఓ వృద్ధుడు కత్తితో సంచరించి కొద్దిసేపు హల్‌చల్ సృష్టించారు. అతడిని నల్గొండ జిల్లాకు చెందిన వృద్ధుడు కోయ రాజుగా పోలీసులు గుర్తించారు. బాబు బస చేసిన ప్రాంతంలో రాజు బ్యాగ్ చేతపట్టుకుని అటూఇటూ తిరుగుతుండటం భద్రతాసిబ్బంది కంటపడింది. ఆరా తీయగా ' చంద్రబాబును చూసేందుకు వచ్చాను'' అని చెప్పాడు. అనుమానం వచ్చి తనిఖీ చేయగా బ్యాగులో చిన్న గొడ్డలి, చాకు కనిపించాయి.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ఆయనను అదుపులోకి తీసుకొని కూచిపూడి పోలీసులకు అప్పగించారు. పోలీసులు మరింత నిశితంగా బ్యాగును సోదా చేయగా..మూలికావైద్యానికి సంబంధించిన పొడులు, వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, చిన్నత్రాసు ఉన్నాయి. దాంతో పోలీసులూ, టీడీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామని, నల్గొండ తరలిస్తున్నామని చల్లపల్లి సీఐ బాలరాజు తెలిపారు.