March 2, 2013

చంద్రోపదేశం


తెలుగు తమ్ముళ్ళకు పార్టీ అధినేత చంద్రబాబు గీతోపదేశం చేశారు. చిట్పూర్పు వద్ద తాను బసచేసిన ప్రదేశంలో శుక్రవారం విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలకు కర్తవ్యబోధనతోపాటు నాయకులకూ చురకలేశారు.

రాబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ప్రత్యర్థులను ఎదుర్కోనడానికి అ వసరమయ్యే ఉపాయాలు, మెళకువలను వివరిస్తూ వారిని మానసికంగా సంసిద్ధం చేసే ప్రయత్నం చేశారు. రెండు నియోజకవర్గాల నుంచీ పెద్దసంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశంలో కొందరు కార్యకర్తలు నిర్మొహమాటంగా పార్టీ గురించి, పడుతున్న బాధల గురించి అధినేత దృష్టికి తీసుకువెళ్లారు.

కార్యకర్తలందరిదీ ఒకే కుటుంబం..
టీడీపీ కార్యకర్తలందరూ ఒక కుటుంబంలోని సభ్యులుగానే మెలగాలన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తలా ఒక చెయ్యి వేయాలని, పరామర్శలు, పలుకరింపులతో పాటు సెంటిమెంట్లను కాపాడుతూ వారికి ధైర్యంచెప్పాలన్నారు. విజయవాడ 56వ డివిజన్ నేత నాగమణి తనకు శస్త్రచికిత్స జరిగితే ఇన్‌చార్జి కనీసం పలుకరించలేదన్నా దానిపై బాబు స్పందించారు.

నాయకుడు ఎలా ఉండాలంటే...

రాజకీయాల్లో నాయకుడు నడవడికే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. ప్రజల్లో తిరిగి వారి సమస్యలు తెలుసుకోవాలనీ, అందరి మన్ననలు పొందాలన్నారు. పనికిరాని రాయికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే దేవుడిగా మారుతుందనీ, ఆ తర్వాత రాయిలో దేవుడిచూస్తూ కొలుస్తామనీ, అలాగే నాయకుడు కాకముందు ఎవరైనా రాయి వంటివారేనన్నారు. సామాన్యుడిని ఒక్కసారి నాయకుడిగా ఎదుగుతాడు ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడానికి నిత్యం శ్రమించాలి.

సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

కార్యకర్తల సమావేశాలు, సమీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని చంద్రబాబు సూచించారు. ఎస్ఎంఎస్‌లు, నెట్ ద్వారా ఈ మెయిల్స్ పంపి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలసుకోవాలన్నారు.

పార్టీకి ఇబ్బందులు కలిగిస్తే కఠిన నిర్ణయాలే...

పార్టీకి ఇబ్బందులొస్తాయనుకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. భేదాభ్రియాలుంటే సరిచేసుకోవాలనీ, మీవల్ల కాకుంటే ఇంకొకరి వద్ద, మరొకరి దృష్టికి తీసుకువచ్చి సరిచేసుకోవాలన్నారు. గ్రామాల్లో గ్రూపులు ఉంటున్నాయని కార్యకర్తలు చెప్పడంతో బాబు ఈవిధంగా స్పందించారు. నేను ఒక్కడినే శ్రమిస్తే సక్సెస్ రాదనీ, కార్యకర్తలంతా కష్టపడాలని బాబు కోరారు. ప్రజల్లోకి వెళ్ళి పాజిటివ్ ధృక్ప«థంతో వెళ్లాలన్నారు.

తప్పులు చేస్తే జైలు కెళ్ళేవాళ్ళం...


30ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశా.. రెండోసారి ప్రతిపక్ష నేతగా ఉన్నా నేను ఏ తప్పూ చేయలేదని చంద్రబాబు అన్నారు. ఇసుక, బొగ్గు, మైనింగ్ కుంభకోణాల్లో మనమెన్నడూ లేమనీ, తప్పులు చేసుంటే జైళ్ళలో ఉండేవారమన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు గౌరవం లేదు. టీడీపీ కార్యకర్తలంటే ఎంతో గౌరవం ఉందనీ, మిమ్ముల్ని చూస్తే గర్వంగా ఉందంటూ చంద్రబాబు అన్నారు.

రఘురాం

సేవలు ఉపయోగించుకుంటాం...


జగ్గయ్యపేట నియోజకవర్గంలో రఘురాం సేవలు పార్టీకి ఉపయోగించుకుంటామని చంద్రబాబు అన్నారు. పాతతరం నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలనీ, గెలుపు కష్టమైన సమయంలో అందరితో చర్చించి కొత్తవారికైనా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందనీ, అందుకు జగ్గయ్యపేట ఉదాహరణ అన్నారు. రఘురాంకు తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు.

సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, ఎమ్మెల్సీ వె.ౖవి.బి.రాజేంద్రప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీమోహన్, కేశినేని నాని, కాగిత వెంకట్రావు, బచ్చుల అర్జునుడు, పంచుమర్తి అనూరాధ పాల్గొన్నారు.