March 2, 2013

.. వీళ్లా మన భావి పౌరులు!

ఆ పేదల దేవాలయాలు తెరుచుకోవు. తాళం తప్ప మరేదీ పలకరించదు. పూజారి కనికరిస్తే దేవుడు అలుగుతాడు. దేవుడు వరమిస్తే పూజారి మొండిచెయ్యి చూపుతాడు. ఇవీ మన ధర్మాసుపత్రులు. పేదోడి దరిన ఉండాల్సిన ఈ వైద్యశాలలు దానాధర్మం అన్నట్టు తయారయ్యాయి. వాటిని నమ్ముకుంటే అంతే సంగతులు.. నెలలో ఒకట్రెండు సార్లే వైద్యుడి దర్శనం అవుతుంది. మిగతా కాలమంతా కాంపౌండర్లదే రాజ్యం. విలువైన ప్రజల ప్రాణాలు వానాకాలం వైద్యంతో చెలామణి అయిపోయే వీళ్ల చేతుల్లోనా?..పెడసనగల్లులో ఇద్దరు మహిళల ఆసరాతో ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు.

చాలాకాలంగా మంచంలోనే ఉన్నాడట. నేను వచ్చానని తెలిసి.. చూడాలని కోరితే అతికష్టం మీద తీసుకువచ్చారట. స్థానిక ఆస్పత్రి గురించి ఆరా తీశాను. అందులో చేర్చి నయం చేయించవచ్చు కదా అని సూచించాను. ఆరోగ్య శ్రీ ఉంటే వైద్యం కూడా ఉచితంగానే చేస్తారు కదా అని పరామర్శించాను. గుడిలో ఉత్సవ విగ్రహంలాగే.. ఊళ్లో ధర్మాసుపత్రి ఉన్నదని ఆ మహిళలు చెప్పుకొచ్చారు. ఆ దేవుడైనా పదిసార్లకు ఒకసారైనా మొర ఆలకిస్తాడేమో గానీ.. ఈ ఊరి డాక్టర్ వంద సార్లకూ ఉలకడట. ఈ వ్యక్తిలాగే జీవచ్ఛవాల్లా పడి ఉన్న వారందరి కోసం ప్రాణం కొట్టుకుంటోంది. పెదపూడిలో దళిత వాడలకు వెళ్లాను. అవన్నీ మురికివాడల్లా కనిపించాయి.

చింపిరి జుట్టు పిల్లలు ఆ మురుగ్గుంటల పక్కనే ఆటాడుకుంటున్నారు. పీలగా ఉన్న ఆ చిన్నారుల కళ్లు పీక్కుపోయాయి. అపరిశుభ్ర వాతావరణంలో తిరగడంతో పాటు.. వేళకు సరైన తిండీ లేకపోవడంతో వారంతా చిక్కిపోయారు. వాళ్ల అమ్మానాన్నకు ఉంటే కదా వీళ్లకు పెట్టడానికి? ఎముకల గూళ్లలా ఉన్నారు. వీళ్లేనా మన భావి భారత పౌరులు!