February 28, 2013

ఆ ఆశీస్సులతోనే అడుగులేస్తున్నా!

కృష్ణాజిల్లాను రెండోసారి సందర్శిస్తున్నాను. అయినా అదే ఆదరణ, అదే ఉత్సాహం.. ఊళ్లకు ఊళ్లు ఊగిపోవడం చూస్తున్నాను. పనులు మానుకొని రోడ్డు పక్కన బారులు తీరిన జనాలను పలకరించాను. వాళ్లను చూడ్డం కోసం నేను.. నన్ను చూడ్డం కోసం వాళ్లు.. ఒకరికొకరం ఎదురయ్యాం. చిరపరిచితుల్లా నన్ను అల్లుకుపోయారు. నా కాళ్ల నొప్పులు, కీళ్ల తీపుల గురించి అడిగి కళ్లు వత్తుకున్నారు. నా కోసం పరితపించే ఇన్ని హృదయాల తోడు లేకుండా ఇంత దూరం నడవగలనా? కొండంత అండను జెండాలా వీళ్లు ఎత్తిపట్టకుండా పాదయాత్రపై రేగిన విమర్శలకు సమాధానం చెప్పగలిగేవాడినా? చుట్టుముట్టిన సందేహాలను విరామం లేని నడకతో ఎదుర్కోగలిగేవాడినా?.. మోపిదేవిలో అడుగులు వేస్తున్నప్పుడు మెదిలిన ఆలోచనలివి.

చల్లపల్లికి పోతున్నప్పుడు సాయంత్రం కొంతమంది ఎదురయ్యారు. వారిలో చాలామంది ఆడపడుచులే. మోపిదేవి నుంచి వస్తున్నామని చెప్పారు. పని చేసుకొని వస్తుంటే నా రాక విషయం తెలిసి ఆగిపోయారట. వాళ్లతో మాట్లాడుతుండగానే మరికొందరు కలిశారు. కోడూరు, మందపాకల నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని చల్లపల్లికి వస్తున్నామని చెప్పుకొచ్చారు. ఊళ్లు వేరయినా వాళ్లంతా నీళ్ల సమస్యనే నా దృష్టికి తెచ్చారు. ఊరి బావుల్లో ఉప్పు చేరిందట. పశువులు కూడా ముట్టడం లేదట. చేసేది లేక నీళ్లు కొనుక్కొని తాగుతున్నారట. కొన్ని ఊళ్లలోనయితే కొంతమంది దాతలు ముందుకొచ్చి రోజూ ట్యాంకర్లతో నీళ్లు పోయిస్తున్నారట. లేదంటే.. రోజుంతా పనిచేసి నడుములు విరిగిపోతున్నా, బిందె పట్టుకొని మైళ్ల దూరం పోయి నీళ్లు తెచ్చుకోక తప్పదట. ఇప్పుడు సరే.. ఎండాకాలం ముదిరితే ఏం చేస్తారో..! తలుచుకుంటేనే గుండె నీరయ్యే విషయమిది.