February 28, 2013

కాంగ్రెస్ హయాంలో ప్రజలకు కష్టాలు

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజలకు కష్టాలే తప్ప ఒరిగేదేమీలేదని జగన్ సోదరి షర్మిల అన్నారు.జూలకల్లులో బుధవారం సాయంత్రం వైఎస్ ఆర్ విగ్రహావిష్కరణ అనంతరం ఆమె మాట్లాడారు. పంటలు పండించుకునేందుకు సాగునీరు అందదు. ఇంటికి వస్తే కరెంట్ ఉండదు. రైతులకు ఇబ్బందులు కాక సుఖం ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. మరో ఆరునెలలు,ఏడాదిలోపు జరిగే ఎన్నికల్లో జగన్ విజయం సాధించటం తథ్యమని, అప్పుడు ప్రజాసమస్యలు తీరుతాయని అన్నారు.వైఎస్ఆర్ చేసిన రుణమాఫీతో జూలకల్లు రైతులకు రూ.3కోట్లు లబ్ధిచేకూరిందని చెప్పారు. పలువురు మహిళల, విద్యార్థుల సమస్యలను తెలుసుకొన్నారు.

పరీక్షల సమయంలో విద్యుత్‌లేక చదువుకు ఆటంకం కలుతుతున్నదని, కాలనీలో మంచినీటి సమస్య ఎదురైనా పట్టించుకోనేవారేలేరని పేర్కొన్నారు. బ్యాంక్ రుణాలు అందటంలేదని పలువురు మహిళలు షర్మిలకు తెలిపారు.జూలకల్లు ఎస్సీకాలనీకి షర్మిల 11గంటలకు చేరుకుంది. ఆ సమయానికి ప్రత్యేక బస్సులో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ చేరుకొంది. షర్మిల కూడా బస్సులో తల్లి విజయమ్మతో 20నిమిషాలు, భోజన విరామ సమయంలో మరో అర్థగంట పాటు చర్చించారు. అనంతరం పందిటివారిపాలెంలో పాదయాత్ర నిర్వహించి బస చేసే ప్రదేశానికి ఆమె చేరుకొంది.

కార్యక్రమంలో మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, యనుముల మురళీధర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, కట్టా వెంకటేశ్వరరెడ్డి, గండికోట కోటేశ్వరరావు, చిట్టా విజయభాస్కరరెడ్డి, వుగ్గు నాగేశ్వరరావు, సజ్జల చంద్రయ్య, వై హెచ్ కె మోహనరావు, అల్లు పిచ్చిరెడ్డి, చల్లా పిచ్చిరెడ్డి, వి.కె.విశ్వనాథ్‌బాబు, తాడికొండ చిన ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.