February 28, 2013

బ్రదర్ అనిల్ సంగతేంటి?

ఆంధ్రా అగస్టాపైనా విచారణ..: రాజ్యసభలో టీడీపీ

అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్ పాత్రపైనా విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడు దేవేందర్‌గౌడ్, ఎంపీ సీఎం రమేశ్ డిమాండ్ చేశారు. అగస్టా కుంభకోణంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వారు ప్రసంగించారు. దేశంలో ఏ కుంభకోణం వెలుగుచూసినా దాని మూ లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నాయని సీఎం రమేశ్ విమర్శించారు.

ఎమార్-ఎంజీఎఫ్ డైరెక్టర్ హష్కే ప్రారంభించిన ట్రస్టుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 800 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింద ని, ఆ ట్రస్టుకు వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ ట్రస్టీగా ఉన్నారని వెల్లడించారు. దేశంలో అగస్టా హెలికాప్టర్‌ను ముందుగా కొనుగోలు చేసింది వైఎస్ హయాంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని.. ఆ హెలికాప్టర్ ఈ మధ్యనే కాలిపోయిందని, ఈ వ్యవహారంపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలోనే ఈ కుంభకోణానికి అంకురార్పణ జరిగిందని దేవేందర్‌గౌడ్ ఆరోపించారు. దీంతో.. అప్పుడు సభలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్ ఆయన వ్యాఖ్యలను ఖండించారు.