February 28, 2013

టీడీపీలో 'ఎమ్మెల్సీ' పోటీ

పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
అధినేత ముందుకు విజ్ఞాపనల వెల్లువ

ఎమ్మెల్సీ పదవుల కోసమ పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య తెలుగుదేశం పార్టీలో రోజురోజుకూ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు అధినేత చంద్రబాబును కలిసి తమ అర్హతలను వివరిస్తూ ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి పీ చంద్రశేఖర్ తాజాగా రేసులోకి ప్రవేశించారు. తెలంగాణలో మిగిలిన బీసీ కులాలకు తగినంత ప్రాతినిధ్యం ఉన్నా ముదిరాజ్ కులానికి మాత్రం తగినంత లేదని, ఆ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కొద్ది రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడిని కలిసి తన పేరును ఎమ్మెల్సీకి పరిశీలించాలని కోరారు. తన నియోజకవర్గం రిజర్వు అయిందని, తనకు ఏదైనా పదవి ఉంటే జిల్లాలో పార్టీని సమన్వయపర్చే బాధ్యతను మరింత మెరుగ్గా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని ఆయన పార్టీ అధ్యక్షుడికి చెప్పారు. అదే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత గంగాధర చౌదరి కూడా తన పేరును పరిశీలించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడికి లేఖ పంపారు.

చంద్రబాబు పాదయాత్రలో మొదటి రోజు నుంచి తన వాహనంతోపాటు పాల్గొంటున్న వికలాంగుల విభాగం నేత జి. కోటేశ్వరరావు కూడా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అధినేతను కోరారు. వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన పార్టీ అధినేత.. ఈ పదవుల్లో కూడా ఒక వికలాంగుడికి అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బత్తిని వెంకటయ్య కూడా తన అభ్యర్థిత్వంపై పార్టీ అధ్యక్షుడికి విజ్ఞాపన పంపారు. గతంలో తనకు ఎంపీ టికెట్, జడ్పీ చైౖర్మన్ అవకాశం చేరువలోకి వచ్చి చేజారిపోయాయని, పార్టీకి దీర్ఘకాలంగా అంటిపెట్టుకొని ఉన్న తన అంకిత భావాన్ని దృష్టిలో ఉంచుకొని తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.