February 28, 2013

ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్: కేటీఆర్

పేదరికం పెంచే బడ్జెట్
నల్లధనం, అవినీతి మాటే లేదు: బాబు
మాది ప్రజారంజక బడ్జెట్: బొత్స

కేంద్ర మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలో పేదరికాన్ని మరింత పెంచే విధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. కృష్ణాజిల్లా పాదయాత్రలో ఉన్న చంద్రబాబు.. చిదంబరం బడ్జెట్ ప్రతిపాదనలను తూర్పారబట్టారు. "అవినీతి అంశాన్ని కనీసంగానూ పట్టించుకోలేదు. మూడు ప్రాధాన్యాల్లో మహిళలు ఒకరని చెబుతూనే, వారి సంక్షేమంపై మొండి చెయ్యి చూపించారు. నిరుద్యోగితను తగ్గించే చిన్న పరిశ్రమల రంగాన్ని పట్టించుకోలేదు. పేదరికం నిర్మూలనకు కీలకమైన ఆహార భద్రత బిల్లుపై ప్రకటనే లేదు'' అని విమర్శించారు. వ్యవసాయ రంగానికి.. రూ. 27 వేల కోట్లు ముష్టిలా పడేశారని దుయ్యబట్టారు.

ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కేటాయించిన 1400 కోట్లు ఒక్క నల్గొండ జిల్లాకే సరిపోదని పెదవి విరిచారు. కోతల బడ్జెట్‌ను సమర్పించారని ఆ పార్టీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, చేనేత, పారిశ్రామిక రంగాలకు మొండి చెయ్యి చూపించారని ఎంపీలు ఎంపీలు గుండు సుధారాణి, శివప్రసాద్, మోదుగుల విమర్శించారు. అయితే.. గ్రామీణాభివృద్ధికి, మహిళా శిశు సంక్షేమానికి, మైనారిటీల పురోభివృద్ధికి బడ్జెట్ పెద్ద పీట వేసినట్టు పీసీసీ చీఫ్ బొత్స కొనియాడారు. మళ్లీ అధికారం తమదేనని తేలిపోయిందని చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్ రుద్రరాజు పద్మరాజు ధీమా వ్యక్తం చేశారు.

మధ్యతరగతి, పేదలపై భారం పడకుండా బడ్జెట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని కేంద్ర మంత్రి చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్ తీరు ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు ఎద్దేవా చేశారు. రైతు రుణ మాఫీని కనీసం ప్రస్తావించి ఉంటే ఆత్మహత్యలు ఆగేవని అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ప్రమాదకర చర్య అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. అన్నివర్గాలనూ సంతృప్తి పరచాలనే ఆత్రుత వల్ల బడ్జెట్ కిచిడిలా తయారైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు.

బడ్జెట్ వల్ల దేశంలోని 80 శాతం ప్రజలకు ఏ ఉపయోగమూ లేదని వైసీపీ నేత సోమయాజులు విమర్శించారు. బడ్జెట్ బడుగు, బలహీనవర్గాలను విస్మరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. అంకెల గారడీ తప్ప ప్రజాప్రయోజనమే పట్టలేదని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించగల గొప్ప అవకాశాన్ని చిదంబరం చేజార్చుకున్నారని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు, శాసనసభ్యుడు డాక్టర్ ఎన్.జయప్రకాశ్‌నారాయణ (జేపీ) అన్నారు.