February 28, 2013

జన వారధి

టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్వేగానికి గురయ్యారు. 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర పెనుమూడి వారధిపై గుంటూరు జిల్లా సరిహద్దును దాటి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే సమయంలో ఘనంగా వీడ్కోలు పలికేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులను చూసి గుంటూరును వీడుతుండటం కొంత బాధగా ఉందని వ్యాఖ్యానించారు. తన వెంట అడుగులో అడుగేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పోలీసు శాఖ పరంగా అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించిన పోలీసులనూ అభినందించారు.

'పాదయాత్ర చేపట్టిన తర్వాత ఏ జిల్లాలోనూ 22 రోజులు ఉండలేదు. గుంటూరు జిల్లాలోనే ఇన్ని రోజులు ఉండి 201 కిలోమీటర్లు ప్రజల సమస్యలు తెలుసుకొంటూ నడిచాను. ఎనిమిది నియోజకవర్గాల్లో ఒక కార్పొరేషన్, నాలుగు మునిసిపాలిటీలు, 167 గ్రామాల ప్రజలను పలకరించాను. వారి కష్టాలను అతి దగ్గర నుంచి చూశాను. జిల్లా ప్రజల కష్టాలు నాకు పలుమార్లు కళ్ళ నీళ్లు తెప్పించాయి. నా పాదయాత్ర ద్వారా మీకు గుండె ధైర్యం కల్పించాను. మూడు వారాలు ఎలా గడిచిపోయాయనేది వెనక్కు తిరిగి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. నా తపన అంతా గాడి తప్పిన ర్రాష్టాన్ని బాగు చేయాలి. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాటం కొనసాగిస్తాను. కృష్ణా జిల్లాకు వెళ్ళాలంటే బాధగా ఉంది. అయినా తప్పదంటూ..' చంద్రబాబు చేసిన ఉద్వేగభరిత ప్రసంగం అక్కడికి వచ్చిన ప్రజలను కూడా ఆవేదనకు గురి చేసింది. కొంతమంది కార్యకర్తలు 'బాబు గారు... మీ ఆరోగ్యం జాగ్రత్త' అని ఆత్మీయతను వ్యక్తం చేయగా చంద్రబాబు స్పందిస్తూ నాకు ఏమి కాదు. మీ అందరి ఆశీస్సులతో పాటు భగవంతుడి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎండ ల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని గురువారం నుంచి సాయంత్రం పూటే పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నాను. శ్రీకాకుళం వరకు నడిచి తీరుతానని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు వీడ్కోలు చెబుతూ రేపల్లె నియోజకవర్గంలోని పెనుమూడి వారధి వరకు ఆయన వెంట నడిచారు. అప్పటికే అక్కడికి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు రాక కోసం భారీ సంఖ్యలో ఎదురు చూస్తుండటంతో వారికి బాధ్యతలు అప్పగించి వెనుదిరిగారు. చంద్రబాబు అందరికి అభివాదం చేస్తూ గుంటూరు జిల్లాను వీడి కృష్ణా జిల్లాలోకి పులిగడ్డ వద్ద అడుగు పెట్టారు.

కృష్ణా పశ్చిమ డెల్టాకూ...

సాగునీరు ఇవ్వాలి


తన పోరాటం, హెచ్చరికలతో ప్రభుత్వం దిగి వచ్చి నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తానని చేసిన ప్రకటనపై చంద్రబాబు స్పందించారు. 'కృష్ణా పశ్చిమ డెల్టాలోనూ సాగునీటి ఎద్దడి సమస్య ఉంది. డెల్టాకు కూడా నీరివ్వాలి. ఇవ్వకపోతే కబడ్దార్... జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వాన్ని స్తంభింప చేసి అయినా మీకు నీళ్లు ఇప్పించే బాధ్యత నాది అని' చంద్రబాబు డెల్టా రైతుల గుండెల్లో ధైర్యం నింపారు.

కార్యకర్తలు విజృంభించాలి... నాయకులు ప్రజల్లో ఉండాలి

ప్రజలు కాంగ్రెస్‌తో విసిగి వేసారిపోయి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. పాదయాత్రలో నేను ఎక్కడికెళ్లినా భారీగా తరలివచ్చి నా వెంట నడిచారు. పార్టీ కార్యకర్తలంతా విజృంభించాలి. నాయకులు ప్రజల్లో ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా కష్టపడి పని చేసి టీడీపీని గెలిపించాలన్నారు. యువత విజృంభించి అవినీతిపై పోరాటం చేసి అంతమొందించాలని చంద్రబాబు స్ఫూర్తిని రగిల్చారు.