February 28, 2013

కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు: టీడీపీ

ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఘోరమైన అన్యాయం జరిగిందని, దీన్ని సరిదిద్దకపోతే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ ఉపాధ్యక్షుడు ఇ.పెద్దిరెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. తమను ఇబ్బంది పెట్టవద్దని ఢిల్లీ పెద్దలు చెప్పగానే ముఖ్యమంత్రి కిరణ్ మిన్నకుండిపోయారని విమర్శించారు. దక్షిణమధ్య రైల్వేద్వారా భారీగా ఆదాయం వస్తున్నా, అందులో ఎనిమిదో వంతు కూడా రాష్ట్రానికి కేటాయించకపోవడం దారుణమన్నారు. 'పోయినేడాది రూ.3 వేల కోట్లు కేటాయించారు. ఈసారి వెయ్యి కోట్లు తగ్గించేశారు. రూ.1.90 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్‌లో ఇంతపెద్ద రాష్ట్రానికి కేటాయించేది రూ.2 వేల కోట్లేనా? రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కర్నూలుకు వ్యాగన్ రిపేర్ షాపు తెచ్చుకున్నారు.

కొండంత రాగం తీసి తుమ్మదియ్యలో అన్నట్లు అదొక్కటే రాష్ట్రానికి ఒరిగింది. రాష్ట్రంలో 11 ప్రాజెక్టులకు భూమి ఇస్తామని, సగం ఖర్చు భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా పోయినేడాది పైసా కూడా కేటాయించలేదన్నారు. కాజీపేట వద్ద ఓ చిన్న స్థల వివాదాన్ని కూడా పరిష్కరించలేక వదిలేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. నిధుల సాధనకు మన అధికార పార్టీ ఎంపీలు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, రైల్వే బడ్జెట్ కొంత ప్రోత్సాహం-కొంత నిరుత్సాహం కలిగించిందని యూపీఏ భాగస్వామి డీఎంకే అధినేత కరుణానిధి వ్యాఖ్యానించారు.

ప్రయాణ చార్జీలను పెంచకపోవడం సంతోషమే అయినా, వాటిపై రుసుములు, రవాణా చార్జీల పెంపుతో భారం పడుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేరళకు చెందిన కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశిథరూర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై ప్రజల అసంతృప్తిని పంచుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఇది అత్యంత నిరుత్సాహకరంగా ఉందని పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ పేర్కొన్నారు.