February 28, 2013

గుంటూరు-తెనాలి-విజయవాడ ట్రైసిటీగా అభివృద్ది

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయటంతోపాటు గుంటూరు, తెనాలి, విజయవాడ నగరాలను కలుపుతూ ట్రై సిటీగా ఏర్పాటు చేసి పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించటంతోపాటు మెగా సిటీగా రూపొందించేలా గుంటూరు జిల్లా డిక్లరేషన్‌ను రూపొందించామని అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో 22 రోజులపాటు 201 కి.మీల దూరం పాదయాత్ర పూర్తి చేసుకుని బుధవారం సాయంత్రం కృష్ణాజిల్లాకు వెళుతూ, పులిగడ్డ-పెనుమూడి వారధిపై వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడారు.

అధికారంలోకి తీసుకువస్తే, సత్వరమే పులిచింతల ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి డెల్టా రైతాంగానికి సాగునీటి కొరతను తీరుస్తామన్నారు. పోతార్లంక సాగునీటి పథకాన్ని పూర్తి చేసి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. ప్రజా సమస్యలపై నాలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాడుతూనే వుంటానని, ప్రజల హర్షద్వానాల మధ్య తెలిపారు. గుంటూరు ఛానల్, పశ్చిమడెల్టా కాల్వల అభివృద్ధికి చర్యలు చేపట్టి పనులు పూర్తి చేస్తామన్నారు. నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్ నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా జిల్లా ప్రజానీకానికి తాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. నిజాంపట్నం, భట్టిప్రోలు, అమరావతి, కొండవీడు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పులిగడ్డ-పెనుమూడి వారధిని తెలుగుదేశం హయాంలో నిర్మిస్తే, ఆరునెలల ముందు వచ్చిన కాంగ్రెస్ పేరు పెట్టుకోవటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో 32 మంది ఎంపీలు, 11 మంది మంత్రులున్నా రైల్వే బడ్జెట్‌పై నోరు మెదపలేని దద్దమ్మల్లా వున్నారని విమర్శించారు. వేమూరు నియోజకవర్గంలో మూతపడిన జంపని షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఉద్యోగులకు ఉపాధిని కల్పించటంతోపాటు రైతులను ఆదుకుంటామన్నారు.