February 28, 2013

చంద్రబాబు వత్తిళ్లకు దిగావచ్చిన ప్రభుత్వం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒత్తిళ్లకు ప్రభుత్వం దిగి వచ్చింది. నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలో ఆయకట్టుకు మూడు తడులు ఇచ్చామని, ఇక నీరు ఇచ్చేది లేదని చెబుతూ వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాగార్జునసాగర్, కలెక్టరేట్ ముట్టడి హెచ్చరికతో ఒక మెట్టు దిగింది. ఆరుతడి పంటలను కాపాడేందుకు మార్చి 1, 2 తేదీల్లో సాగునీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. డెల్టాలోనూ పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయాలని, లేకుంటే ఆందోళన తప్పదని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి.

చంద్రబాబు జిల్లాల్లోకి అడుగు పెట్టిన రోజే పల్నాడు ప్రాంత రైతులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ నేతృత్వంలో రైతులు ఆయన్ని కలిశారు. ఆరుతడికి నీళ్లు ఇవ్వకపోవడంతో మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయని, తక్షణం నీరు విడుదల చేయించాలని కోరారు. ఆ రోజునే చంద్రబాబు స్పందించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రైతుల కష్టాలను వివరిస్తూ సాగునీటిని విడుదల చేయాలని కోరారు. సాగర్‌లో 490 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు తాము నీళ్లు ఇచ్చి చివరి భూముల పంటలను కూడా కాపాడామని, ఇప్పుడు 515 అడుగుల నీటిమట్టం ఉంటే ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సీఎంకు నీటి యాజమాన్యం, వ్యవసాయం గురించి తెలియదని వ్యాఖ్యానించారు. డెల్టా ప్రాంతంలో ఆరుతడి పంటలు వేసిన రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడుతుండటాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఒక దశలో మహాధర్నాకు దిగాలని నిర్ణయించగా అదే రోజున భారీ వర్షం పడటంతో విరమించుకున్నారు. కొద్ది రోజులుగా ఎండలు పెరిగిన నేపథ్యంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతుల కడుపుమంటపై చంద్రబాబు కసిగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తనతో రావాలని సాగర్, కలెక్టరేట్‌ను ముట్టడిద్దామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సాగర్‌లో పంటలు కాపాడేందుకు మార్చి 1, 2 తేదీల్లో నీటిని విడుదల చేయించేందుకు ఒప్పించారు. డెల్టాలో పంటలకు నీటి విడుదల విషయంలో వారం తర్వాత నిర్ణయం తీసుకొంటామన్నారు. ప్రభుత్వంలో చంద్రబాబు చలనం తీసుకురావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.