February 12, 2013

కేక్ కట్ చేసి, 2వేల బెలూన్లు ఎగురవేసిన చంద్రబాబు

2 వేల కి.మీ. పూర్తి చేరుకున్న బాబు పాదయాత్ర
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర మంగళవారం నాటికి 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, రెండువేల బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున నేతలు, అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలు చూపిస్తున్న అభిమానం జీవితంలో మరువలేనిదని అన్నారు. మనకు రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందిగానీ, ఆర్థిక స్వాతంత్య్రం రాలేదని అన్నారు. సమసమాజం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, కానీ కొందరు నేతలు దోచుకోడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హాయంలో రహదారులను అభివృద్ధి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ దొంగలు ప్రజలను దోచుకుంటున్నారని, ప్రజా ధనం కాంగ్రెస్ నేతల జేబుల్లోకి పోతుందని ఆయన ధ్వజమెత్తారు.

నిత్యావసర వస్తువులు పేద, మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వం అసమర్థల వల్లే ధరలు పెరిగాయని ఆరోపించారు. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై 35వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోపిందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని పేదలకు లక్ష రూపాయలతో ఇల్లు నిర్మించి ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇదివరకే చెప్పినట్టుగా రుణ మాపీ చేసి చూపిస్తామని బాబు పేర్కొన్నారు.

గత ఏడాది అక్టబర్ 2న 'వస్తున్నా...మీకోసం'' పాదయాత్రను చేపిట్టిన చంద్రబాబు నాయుడు 134 రోజులలో రెండువేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 12 జిల్లాలు, 55 నియోజకవర్గాలు, 107 మండలాలు, 17 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, 915 గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు, వరంగల్ జిల్లాలో 1500 కి.మీ. గుంటూరు జిల్లాతో 2000 కిలోమీటర్లు పూర్తి చేశారు.

మంగళవారం ఉదయం జిల్లాలోని డీఎస్‌నగర్ నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష విగ్రహాలు. ఆయన లక్ష కోట్ల రూపాయల దోపిడీకి స్పష్టమైన నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. వైయస్ తన హయాంలో ప్రజల సొమ్మను తన తనయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అక్రమార్కుల విగ్రహాలు పెద్ద ఎత్తున స్థాపిస్తున్నారని, అవి అక్రమ సంపాదనతో నిర్మించినవే అన్నారు. దోపిడీదారులకు విగ్రహాలు పెట్టడం మన దౌర్భాగ్యమని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని అందుకే, తన పాదయాత్రలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వగలుగుతున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్న కాంగ్రెసు నేతలు రోడ్డు మీదకు వస్తే నిలదీస్తారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. రుణ మాఫీ సాధ్యం కాదని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రమంత్రి సచిన్ పైలట్ వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ అసాధ్యమంటే కేంద్ర నేతలు మాత్రం సై అంటున్నారన్నారు. సుపరిపాలన టిడిపితోనే సాధ్యమన్నారు.

కాగా చంద్రబాబు పాదయాత్రకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అడ్డం రానుంది. ఈనెల 19-21 వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జిల్లాల్లో ఇతర నేతలు ఎవరూ ఉండకూడదని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు సమాచారం అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బాబు యాత్రకు జిల్లాలో మూడు రోజుల పాటు విశ్రాంతి లభించే అవకాశాలున్నాయి.