February 12, 2013

ఓ అన్నగా మీకు అండగా ఉంటా

సీనియర్ ఇంటర్ విద్యార్థినులు... మీరు బాగా ఉత్సాహంతో ఉన్నారు. మగవాళ్ల కంటే మీకే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ల కంటే చదువులో బాగా రాణిస్తారు. అయితే మీ అమ్మా, నాన్న ఇంట్లో మీపై వివక్ష చూపిస్తుంటారు. మగపిల్లలు ఏదో ఉద్ధరిస్తాని చివరికి టీచర్లు కూడా అదే పని చేస్తుంటారు. ఆడపిల్లలేమో ప్రభుత్వ స్కూళ్లలో, మగపిల్లలేమో ్రపైవేటు స్కూళ్లలో చదివిస్తుంటారు.

ఈ వివక్ష పారద్రోలేందుకు ఒక అన్నగా మీకు అండగా నిలబడి మీ జీవితాలు ఉన్నతస్థాయికి తీసుకెళతానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. సోమవారం ఉదయం చైతన్య కళాశాల విద్యార్థినులతో చంద్రబాబు జిల్లా కేంద్రంలోని రింగురోడ్డులో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌టీఆర్ ఆస్తిలో సమానహక్కు కల్పించారని, దానిని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ హయాంలో ఆడపిల్లలపై వివక్షను దూరం చేయాలనే ఆలోచనతో ఆడపిల్లల సంరక్షణ కార్యక్రమాన్ని అమలు చేశామన్నారు. పేద విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశామని, డ్వాక్రా గ్రూపులు పెట్టి ఆర్థికంగా నిలబడేలా చేశామన్నారు.

నిట్ పరీక్ష రద్దు


చేసేంతవరకు పోరాడతా


ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంసెట్‌కు సిద్ధం కావాలో, నిట్‌కు సన్నద్ధం కావాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు ప్రభుత్వమే అయోమయ స్థితిలో ఉన్నది. ఏ విషయమైనా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు చెప్పాలి. మీరు చదివే సిలబస్ వేరు. పరీక్ష వేరు. ఈ నేపథ్యంలో ఎంసెట్ అయితేనే మీకు బావుంటుంది. ఈ విషయంలో నేను సీఎంకు లేఖ రాస్తాను. నిట్ పరీక్ష రద్దు చేసి ఎంసెట్‌లోనే ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించేంతవరకు పోరాటం చేస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.

ప్రపంచాన్ని శాసించగలసత్తా మీకే ఉందిఅమెరికా, చైనాకు లేని యువత మనకు ఉన్నది. యువత లేని చోట ఉత్పత్తి ఉండదు. మీరు బాగా చదువుకొంటే ప్రపంచాన్ని శాసిస్తారు. రాబోయే 20 ఏళ్లలో అమెరికా, చైనా కంటే మనమే ముందుంటాం. దీనిని దృష్టిలో పెట్టుకొని బాగా చదివితే మీరు 70 ఏళ్లు సుఖంగా జీవించ వచ్చని చంద్రబాబు సూచించారు.

లేకుంటే కూలీ పనులకు పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పేద పిల్లలు ఎంతవరకు చదువుకొంటే అంతవరకు చదివించి ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగభృతి కల్పిస్తానన్నారు. గాంధీ, అంబేద్కర్, ఎన్‌టీఆర్ వంటి మహనీయులు చిన్న కుటుంబాల నుంచే వచ్చారని చెప్పారు. గతంలో మనల్ని మద్రాసీయులు అని గేలి చేసేవారని, ఎన్‌టీఆర్ తెలుగుజాతికి వన్నె తీసుకొచ్చారని పేర్కొన్నారు. నాడు ఐటీ రంగానికి ఉన్న డిమాండ్‌ను అంచనా వేసి హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, సైబరాబాద్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాని వలన చదువుకొన్న ప్రతి ఒక్కరికీ ఐటీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం సీఏ, లా, అకౌంటెన్సీ, టూరిజం రంగాలకు డిమాండ్ ఉన్నదని, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఏ రంగంలో ఉపాధి ఉందో తెలియజేసి ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత తీసుకొంటానని చంద్రబాబు హామి ఇచ్చారు.