February 12, 2013

అవినీతితో రాజీ పడొద్దు


చంద్రబాబు: తమ్ముడు నువ్వు అవినీతికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టావు?

విద్యార్థి: సార్ నేను అవినీతికి వ్యతిరేకంగా ప్రతి రోజూ 10 మందికి ఎస్ఎంఎస్‌లు పంపుతున్నాను. దానిని తలా పది మందికి పంపమని విజ్ఞప్తి చేస్తున్నాను.

మరో విద్యార్థితో చంద్రబాబు: నువ్వు ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నాని చెబుతున్నావు? ఎలా చేస్తున్నావో వివరించు?

విద్యార్థి: సార్ సీఎం జైలు నుంచి రాడు... ప్రజల్లో నుంచి వస్తాడని మెసేజ్ పెట్టాను. దానిని చాలామంది చూసి స్పందించారు. 2004కు ముందు పాల ప్యాకేట్ రూ. 12 ఉండేది. నేడు రూ. 20 పెట్టి కొనాల్సి వస్తోంది. పెట్రోలు రూ. 34 నుంచి రూ. 74, అగ్గిపెట్టె రూ. 50 పైసల నుంచి రూ. 2 అయ్యాయి. తేడా గమనించమని ఫేస్‌బుక్‌లో విజ్ఞప్తి చేస్తున్నాను.

మూన్‌సేన సభ్యుడు: సార్ మేము అవినీతికి వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఉద్యమం చేపట్టాము. అవినీతికి వ్యతిరేకంగా స్పందించని ప్రజలకు మెత్తగా చురకలు కూడా వేస్తున్నాము. చంచల్‌గూడ ప్యాకేజ్‌లపై వేసిన ఫ్లెక్సీకి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అయితే వైసీపీ కార్యకర్తలు గొడవ చేయడంతో పోలీసులు ఫ్లెక్సీని తొలగించి మాపై కేసులు పెట్టారు.

ప్రవాసాంధ్రుడు: సార్ నేను సింగపూర్‌లో కొన్నాళ్లు ఉన్నాను. నెల క్రితమే ఇక్కడికి వచ్చాను. సింగపూర్‌లో టీ స్టాల్ వద్ద చాయ్ తాగుతుండగా అక్కడి తెలుగువాళ్లు మోస్ట్ డైనమిక్ సీఎం చంద్రబాబు అని, అత్యంత అవినీతిపరుడు జగన్ అని సంభాషించుకోవడం విన్నాను.

ఇలా జిల్లా కేంద్రంలోని బృందావన్‌గార్డెన్స్ సెంటర్‌లోని యువకులు, మహిళలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖాముఖీ సంభాషణ జరిపారు. సోమవారం తన పాదయాత్ర రింగురోడ్డు నుంచి బృందావన్‌గార్డెన్స్ చేరుకొన్న సమయంలో జరిగిన బహిరంగ సభ ముగింపులో చంద్రబాబు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నించారు. తాను సింగపూర్ పర్యటనకు వెళ్లిన సమయంలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ఉదహరించారు. నేను సింగపూర్ వెళ్లినప్పుడు కారు ్రడైవర్‌కు టిప్పు ఇవ్వబోయాను.

టిప్పు తీసుకొనేందుకు నిరాకరించాడు. అక్కడ అవినీతి ఉందా అని అడిగితే లేదని చెప్పా డు. అవినీతికి పాల్పడితే వాడు మరుసటి రోజు జైల్లో ఉంటాడని తెలిపాడు. మా అశోక్‌గజపతిరాజుకు సిగరెట్ తాగడం అలవాటు. అతను అక్కడ నిబంధనలు తెలుసుకొని పర్యటన ముగిసేంతవరకు సిగరెట్ తాగలేదు. ఇక్కడ మాత్రం విచ్ఛలవిడితనం. అవినీతికి పాల్పడి కూడా దానిని సమర్థించుకొనే పరిస్థితి ఉందని చంద్రబాబు ఆక్షేపించారు.

అవినీతి విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడి నిలబడితే రియల్ హీరో అవుతారని చెప్పారు. జగన్ ఎప్పటికీ రియల్ విలన్‌గానే మిగిలిపోతాడన్నారు. ఆడపిల్లలపై జరిగిన అత్యాచార కేసులను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ పెడతామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఢిల్లీ ఉదంతంలో నిందితులను ఉరికంభం ఎక్కిస్తే అంతా సంతోషించేవారని, అలాంటిది కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు.

గుంటూ రు జిల్లాలో కూడా ప్రసన్నలక్ష్మి, ఆయేషామీరా హత్యకు గురయ్యారని, ఆ కేసుల్లో అసలైన నిందితులకు శిక్షలు పడలేదన్నారు. ఆడపిల్లలకు రక్షణ అవసరమని, అందుకోసం ప్రత్యేక చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబు పాదయాత్ర ఆరో రోజు జిల్లా కేంద్రంలో విశేష జన స్పందన లభించింది. సిద్ధార్థగార్డెన్స్ నుంచి పాదయాత్ర కొనసాగిన రింగురోడ్డు, బృందావన్‌గార్డెన్స్, లక్ష్మీపురం మెయిన్‌రోడ్డు, దేవాపురం, అశోక్‌నగర్, కోబాల్డ్‌పేట, బ్రాడీపేట నాల్గో లైను, 14వ అడ్డరోడ్డు, ఏటీ అగ్రహారం, శ్రీనివాసరావుతోట, ఆర్ అగ్రహారం, నల్లచెరువు, ఏటుకూరు రోడ్లు జనంతో కిక్కిరిశాయి. విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్లకు ఇరువైపులా చేరి చంద్రబాబు రాకకోసం గంటల తరబడి నిరీక్షించారు. మహిళలు హారతులిస్తూ, నుదుటిన తిలకం దిద్దుతూ స్వాగతం పలికారు.

ఎక్కడికక్కడ చంద్రబాబుకు ఎదురెళ్లి తమ సమస్యలు చెప్పుకొంటూ మా ఓటు మీకేనంటూ భరోసా ఇచ్చి సాగనంపారు. చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ ఎస్ ఎం లాల్‌జాన్‌బాషా, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, డాక్టర్ శనక్కాయల అరుణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పశ్చిమ, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు యాగంటి దుర్గారావు, ఎస్ ఎం జియావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.