February 12, 2013

లెదర్ పార్కుకు ప్రాణం పోస్తా

 జిల్లాలో లెదర్‌పార్కు ఏర్పాటుకు ప్రాణం పోస్తానని చంద్రబాబు హామి ఇచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో సిద్ధార్థ గార్డెన్స్ వద్ద మాదిక డెవలప్‌మెంట్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100 మంది చర్మకారులకు గొడుగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్లు అమలులోకి వచ్చి 67 సంవత్సరాలు గడుస్తున్నా ఎస్‌సీలకు న్యాయం జరగలేదన్నారు. వాళ్లు పోరాడినా ఫలితం లేకపోయిందన్నారు. 2000 సంవత్సరంలో ఎస్‌సీ వర్గీకరణ చేపట్టి 24,500 మందికి ఉద్యోగాలు ఇచ్చానని, కాంగ్రెస్ పార్టీ 44ఏళ్ల హయాంలో 16వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు.

2004లో ఎస్‌సీ వర్గీకరణను సుప్రీం కోర్టు కొట్టివేసిందని, దానికి కారణం సరైన న్యాయవాదిని కోర్టులో కేసు వాదించేందుకు అప్పటి సీఎం వైఎస్ నియమించకపోవడమేనన్నారు. దుర్గి మండలంలోని అడిగొప్పులలో లెదర్ పార్కు పెట్టామన్నారు. ఆ రోజున తాను మేజర్, మీడియం, మైనర్ లెదర్‌పార్కులు పెట్టేందుకు ప్రయత్నం చేశానని, కాంగ్రెస్ వచ్చి దానిని తుంగలోకి తొక్కిందన్నారు.

అదే లెదర్ పార్కులు ఏర్పాటై ఉంటే ఈ రోజున చెట్ల కింద కూర్చుని చెప్పులు కుట్టుకునే పరిస్థితి ఉండేది కాదని, ఎంచక్కా ఇళ్లల్లో కూర్చుని చెప్పులు తయారు చేసి షాపులకు విక్రయించే అవకాశం అందుబాటులోకి వచ్చి ఉండేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే లెదర్ పార్కులకు ప్రాణంపోసి ఏడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామి ఇచ్చారు.