February 12, 2013

దూరమైనా,భారమైనా బతుకు 'మీ కోసం'

చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర ఆదివారం విరామం అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సోమవారం ఉదయం శిబిరంలో విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు తదితరులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బ్రహ్మకుమారీస్ సభ్యులు బాబును కలిసి ఆశీర్వచనాలు ఇచ్చారు.

సాయి సన్నిధానం అర్చకులు ఘంటసాల విజయస్వామి చంద్రబాబుకు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి పట్టు వ్రస్తాలు బహుకరించారు. డాక్టర్ శనక్కాయాల అరుణ ఆధ్వర్యంలో మహిళా డాక్టర్లు పాదయాత్రకు రూ. 1.5లక్షలు చంద్రబాబుకు విరాళంగా ఇచ్చారు. కమ్మజన సేవాసమితి సభ్యులు గోరంట్ల పున్నయచౌదరి ఆధ్వర్యంలో చంద్రబాబును కలిశారు. నాయకుల సమీక్ష అనంతరం సిద్దార్థ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. బాజాబజంత్రీలతో, జై చంద్రన్న నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగుతుండగా బాబు పాదయాత్రలో ముందుకు సాగారు.

అడుగడునా మహిళల నీరాజనాలను అందుకుంటూ దూరమైన, భారమైన బ్రతుకు 'మీకోసం' అంటూ చంద్రబాబు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రింగురోడ్డులో మాదిగ డెవలప్‌మెంట్ సొసైటీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వందమంది చర్మకారులకు చంద్రబాబు గొడుగులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మాదిగల అభివృద్దికి టిడీపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చి ముందుకు సాగారు. తెలుగు యువత ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు చంద్రబాబును కలిసి నీట్ పరీక్షలను గురించి తమ గోడు చెప్పుకున్నారు.

దీనికి చంద్రబాబు స్పందించి నీట్ పరీక్షను రద్దు చేసి ఎమ్‌సెట్‌ను కొనసాగించాలని విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి లేఖ రాస్తానని విద్యార్థులకు అభయం ఇచ్చారు. అటునుండి యాత్ర బృందావన్ గార్డెన్స్ వైపుకు సాగింది. దారిపొడవునా జనసందోహంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. బృందావన్‌గార్డెన్స్ కూడలిలో చేరేసరికి ఇసుకవేస్తే రాలనంత జనంతో మండుటెండలోమధ్యాహ్నం 12.20 నిమిషాలకు బాబు ప్రసంగం ప్రారంభించారు. అలా 55 నిమిషాలు ఆకట్టుకునే ప్రసంగం చేసి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. 1.15 నిమిషాలకు బృందావన్ గార్డెన్స్ నుంచి యాత్ర లక్ష్మీపురం వైపుకు సాగింది. రోడ్డుకిరువైపులా స్కూల్ విద్యార్థినీ, విద్యార్థుల అభివాదాలతో చిన్నారుల కేరింతలతో చంద్రబాబు ముందుకు సాగారు. లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులోని ఎన్ ఆర్ ఐ అకాడమీ వద్దకు చేరుకోగానే వందలమంది విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

ఆ దృశ్యం చూడగానే బాబు ఆనందంతో చిన్నారులను దగ్గరకు పిలిచి వారితో ఫొటోలు దిగారు. అనంతరం నాయర్ హోటల్ సెంటర్ మీదుగా యాత్ర అశోక్‌నగర్‌కు చేరింది. అశోక్ నగర్‌లో చంద్రబాబు యాత్రకు సంఘీభావం తెలుపుతూ మాజీ కార్పొరేటర్ పీవీ మహలక్ష్మి ఆధ్వర్యంలో 1980 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న చంద్రబాబుకు స్వాగతమంటూ భారతదేశపు మ్యాపును ముగ్గుతో అందంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు భోజన విరామం ప్రకటించారు. భోజన విరామ సమయంలో నిజామాబాద్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు.

కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, షిండే , అన్నపూర్ణమ్మ, ఎమ్మెల్సీ వి జి గౌడ్ పాల్గొన్నారు. 4.10 నిమిషాలకు తిరిగి యాత్ర ప్రారంభమైంది. ఆకట్టుకునే పులి వేషగాళ్ల నృత్యాలతో, ఎన్టీ ఆర్ పాటలతో యాత్ర ముందుకు సాగింది. కోబాల్డ్‌పేట, దేవాపురం, బ్రాడీపేట 4/18, బ్రాడీపేట 4/14 మీదుగా యాత్ర కొనసాగింది.