February 12, 2013

పాదయాత్రలో ఆ నలుగురు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా... మీ కోసం పాదయాత్రలో ఆ నలుగురు కీలకపాత్ర పోషిస్తున్నారు. పాదయాత్ర జరిగే ప్రాంతంలో ప్రజా సమస్యలు, పార్టీ నుంచి ప్రజలు ఆశిస్తున్న విషయాలు, పలు వర్గాల ఆకాంక్షలను అధినేతకు చేరవేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి వీరంతా తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, నీలయపాలెం విజయకుమార్, ప్రకాశం జిల్లాకు చెందిన చాగంటి విజయభాస్కర్, కరిచేటి విజయ్‌భాస్కర్ బాబు వెన్నంటే ఉంటున్నారు.

పాదయాత్రలో జరిగిన సమగ్ర సంఘటనలు, కలిసిన వ్యక్తులు, సంస్థలు, సంఘాలు ఇలా ఏరోజుకారోజు పూర్తి వివరాలతో పార్టీకి అందించేందుకు ఏర్పాటైన డాక్యుమెంటేషన్ కమిటీలో ఈ నలుగురు ఉన్నారు. విజయకుమార్ ఎన్జీవో ఆర్గనైజేషన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. శ్రీశైలరెడ్డి, విజయభాస్కర్ వ్యాపార నిర్వహణలో ఉండగా, హరికిషోర్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఏడాది క్రితం ఏర్పాటైన తెలుగుదేశం అగ్రికల్చరల్ కమిటీలో సభ్యులుగా ఉన్న వీరంతా డాక్యుమెంటేషన్ కమిటీగా ఏర్పడ్డారు.

నాలుగైదు నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటూ చంద్రబాబు పాదయాత్రలో పాల్గొంటున్నారు. అధినేత ఇస్తున్న హామీలు, వాటికి లభిస్తున్న ప్రజాస్పందన, పార్టీ పరంగా ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటారు. రోజువారీ నివేదికను రూపొందించి పార్టీ కార్యాలయానికి, మోనిటరింగ్ కమిటీకి అందజేస్తారు. పాదయాత్రలో చోటుచేసుకునే అన్ని అంశాలను చంద్రబాబుకు వెంటనే తెలియజేస్తారు.

చంద్రబాబు యాత్ర ప్రారంభమైన క్షణం నుంచి పూర్తయిన తర్వాత, అన్ని అంశాలను క్రోడీకరించి, విశ్లేషించి పూర్తిస్థాయి సమాచారాన్ని పార్టీ ప్రధా న కార్యాలయానికి ఈమెయిల్ చేస్తారు. 130 రోజులుగా ఈ కమిటీ సభ్యులు విజయ్‌కుమార్, శ్రీశైల్‌రెడ్డి, విజయ్‌భాస్కర్, హరికిశోర్, బెన్హర్‌కింగ్ అధినేత వెంట, ప్రజల్లో మమేకమై సమాచార సేకరణలో నిమగ్నమై ఉంటున్నారు. పార్టీపై ఉన్న అభిమానంతో, వ్యక్తిగత వ్యవహారాలను, కుటుంబ బాధ్యతలకు దూరంగా, ఆరోగ్య సమస్యలు సైతం లెక్కచేయకుండా యాత్రలో పాల్గొంటున్న వీరంతా పాదయాత్ర పూర్తయిన అనంతరం సేకరించిన సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రజలకు అందించాలనే ఉద్ధేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి సంఘటనను నమోదుచేస్తున్న ఈ ప్రక్రియ పార్టీకి, జిల్లాల్లో పార్టీ భవిష్యత్తు కార్యకలాపాలకు ఓ మార్గదర్శకంగా ఉంటుందని పార్టీ భావిస్తోంది.