February 12, 2013

8 చోట్ల బరిలోకి!

'టీడీపీ ఢీ' సీసీబీ
ఖమ్మం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి,
అనంత, చిత్తూరు, ప్రకాశంలలో పోటీ

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికల్లో ఎనిమిది జిల్లాల్లో పోటీ పెట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అధికార పార్టీతో పోలిస్తే తమకు ఆధిక్యం ఉండడం లేదా అధికార పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోవడం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాలను ఎంపిక చేసింది. ఇటీవలి సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే ఖమ్మం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఆధిక్యం సాధించింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అధికార పార్టీకి బాగా చేరువలో ఉంది. తూర్పు గోదావరి, అనంతపురంలలో ఆ పార్టీకి ఫర్వాలేదన్నట్లుగా సొసైటీలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అక్కడ కూడా టీడీపీ పోటీకి దిగుతోంది. ఖమ్మం డీసీసీబీ పీఠాన్ని పెద్ద ఇబ్బంది లేకుండా టీడీపీ గెలుచుకొనే పరిస్థితి ఉంది. అయినా, కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాల్లో భాగంగా జిల్లా సీపీఎం, వైసీపీ, ఎంఎల్ పార్టీల నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని వెళ్లాలనే యోచనలో టీడీపీ ఉంది. జిల్లాలో బ్యాంకు అధ్యక్ష పదవికి తుళ్లూరు బ్రహ్మయ్య, మువ్వా విజయ్‌బాబు, బోడేపూడి రమేష్ బాబు పోటీలో ఉన్నారు.

ఎక్కువ సొసైటీలు గెలిచిన సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన విజయ్‌బాబుకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటవీరయ్య గట్టిగా పట్టుబడుతుండటంతో అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ కూడా బరిలో ఉన్నా లేదా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్నా మూడు లేక నాలుగు డీసీసీబీలను కైవసం చేసుకోగలమన్న అభిప్రాయంలో టీడీపీ నేతలున్నారు. "కృష్ణా జిల్లాలో మొదటి స్థానంలో మేమే ఉన్నాం. వైసీపీ మద్దతు ఇస్తే తప్ప ఈ జిల్లా బ్యాంకు కాంగ్రెస్‌కు దక్కడం అసాధ్యం. తాజాగా వైసీపీ పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్‌కు అనధికారికంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు మాకు సమాచారం అందుతోంది.

అయినా, మా ఆశలు మాకున్నాయి.'' అని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకొన్నా కోస్తాలో కనీసం రెండు జిల్లాల్లో తాము గెలుపొందగలమన్న ఆశాభావంలో టీడీపీ వర్గాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా, కృష్ణా జిల్లాలో ముదినేపల్లి మండలానికి చెందిన వెంకట సుబ్బయ్య, గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, ప్రకాశం జిల్లాలో దామచర్ల పూర్ణచంద్రరావులను డీసీసీబీ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం.