February 12, 2013

ఇంటికొరకు కదలండి

'వస్త్తున్నా మీ కోసం యాత్రను ప్రజా ఉద్యమంగా మారుద్దాం, ఇందుకు ఇంటికి ఒక్కరు చొప్పున రోడ్లపైకి వచ్చి పాదయాత్రలో నాతో కలవండి'' అని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్‌లో భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అవినీతిపై పోరాడేందుకు ఇంటికి ఒక్కరు చొప్పున రోడ్లపైకి వచ్చి తనతో కదం కలపాలని పిలుపునిచ్చారు.

అవినీతి కాంగ్రెస్ గుండెల్లో దడ పుట్టించాలని అన్నారు. కాంగ్రెస్‌కు స్వతహాగా ఆలోచించే శక్తి లేదని, అన్న నందమూరి తారకరామారావు నేషనల్ ఫ్రంట్‌లో భాగస్వామిగా ఉన్నప్పుడు రుణ మాఫీ అమలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి దాన్ని అమలు చేశారన్నారు. దాన్ని వై ఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసి గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. అదే విధంగా పేదలకు లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో తెలుగు దేశం నగదు బదిలీ పథకం అమలు చేస్తామని చెబితే నేడు కాంగ్రెస్ నకిలీ బదిలీ పథకం పేరుతో పేదల నడ్డి విరుస్తుందన్నారు.

ప్రజలు తెలుగు దేశానికి మద్దతు ఇచ్చి రాష్ట్రంలో 40 ఎంపి స్థానాలు గెలిపిస్తే దేశంలోనూ మనకు నచ్చిన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడవచ్చన్నారు. మనకు నచ్చిన ప్రభుత్వం ఏర్పడితే అనేక పథకాలు అమలు చేయించుకునే వీలు కలుగుతుందన్నారు. తొలి సంతకం రుణమాఫీ మీద చేయడంతో పాటు, గ్యాస్, రేషన్ సరుకుల సబ్సిడీని యధావిధిగా అమలు చేస్తానన్నారు.

నిరంతరాయంగా విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటానన్నారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందన్నారు. మన రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి 'కబంధుడు' అనే రాక్షసుడిలా అందిన కాడికి దోచుకుని, కొడుకు కట్టబెట్టాడన్నారు. నేడు ఆ డబ్బుతో ఆయన కుమారుడు జైలు పార్టీని స్థాపించి ప్రజలను మరోసారి నిలువునా ముంచేందుకు చూస్తున్నాడన్నారు. కాంగ్రెస్, జైలు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. తెలుగు దేశం అధికారంలోకి వస్తే ఎన్టీ ఆర్ సుజల ధార పథకం కింద అందరికీ తాగునీరు అందిస్తామన్నారు.