July 6, 2013

రుణ మాఫీ చేసి చూపిస్తాం...........ఇతర పార్టీలు లెంపలేసుకొనేలా చేస్తాం

చేతిలో పైసా,అధికారంలో లేకపోయినా
ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకున్నాం
టీడీపీ గెలుపు చారిత్రక అవసరం
దక్షిణ తెలంగాణ సదస్సులో చంద్రబాబు


"ఉత్తరాఖండ్ వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు మన చేతిలో పైసా లేదు. మనం ప్రభుత్వంలో లేం. అయినా, ప్రభుత్వానికంటే బాగా చేశాం. అలాగే.. రైతు రుణ మాఫీ కూడా చేసి చూపిస్తాం. ఎలా చేస్తారంటూ ప్రశ్నలు వేస్తున్న పార్టీల నేతలు మనం ఎలా చేశామో చూసి లెంపలు వేసుకొనేలా చేస్తాం. చెప్పిన మాట.. చేసిన హామీ నుంచి వెనుదిరిగే సమస్యే లేదు'' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సులలో భాగంగా దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాల పార్టీ ేతలతో శనివారం నగర శివార్లలోని కొంపల్లిలో ఎక్స్‌లెన్సీ గార్డెన్‌లో సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని, ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వంద సార్లు.. వినకపోతే వెయ్యి సార్లైనా చెప్పి ప్రజలను మన దారిలోకి తెచ్చుకోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. "అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా తరపున ప్రచారం చేసిన కార్యకర్తలు ఇదే వ్యూహం అవలంబించారు. ప్రతి ఇంటికీ వెళ్లి నచ్చచెప్పారు. వినకపోతే పదిసార్లయినా కలిసి నచ్చచెప్పారు. మనం అదే పనిచేయాలి.'' అని వివరించారు. కాంగ్రెస్ పాలనలో దుస్థితిని, టీడీపీ ఇచ్చిన హామీలను పునరుద్ఘాటించారు. "మీకు అస్త్రాలు ఇవ్వడానికే ఈ సదస్సు. చెప్పిన మాట వినకపోతే అభిమన్యుడిలా చిక్కుకొనిపోతారు. చెప్పిన వ్యూహంతో వెళ్లండి. గెలిచి రండి'' అని హితబోధ చేశారు.

సహకార ఎన్నికల్లో టీడీపీకి దరిదాపుల్లో నిలవలేకపోయిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని ఎద్దేవా చేశారు. "సహకార ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బు, అధికారం అన్నీ విరజిమ్మి 12 వేల సొసైటీలు గెలుచుకొంది. అవేమీ లేకుండా మనం 8 వేలు గెలుచుకొన్నాం. టీఆర్ఎస్‌కు వచ్చింది 125, వైసీపీకి వచ్చింది 399. ప్రభుత్వంలోకి వచ్చేది వాళ్లా.. మనమా? మన గెలుపు పంచాయతీ ఎన్నికలతోనే మొదలవుతుంది. స్థానిక ఎన్నికల్లో దున్నేస్తాం. కాంగ్రెస్‌ను కనుమరుగు చేస్తాం'' అని చంద్రబాబు స్పష్టం చేశారు. నవంబర్‌లో పార్లమెంటు ఎన్నికలు వస్తాయని కొందరు ప్రచారం చేస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చక్రం తిప్పేది మనమే
ఈసారి కేంద్రంలో వచ్చేది మూడో కూటమేనని, అక్కడ చక్రం తిప్పేది మనమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. "నాకు కోరికల్లేవు. నేను చూడని అధికారం లేదు. రెండుసార్లు సీఎంగా, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా చేశా. రాష్ట్రాన్ని బాగు చేయడం కోసమే టీడీపీ గెలవాలని కోరుకొంటున్నాను'' అని చెప్పారు. కాంగ్రెస్‌లో మాజీ ముఖ్యమంత్రులెవరూ అసెంబ్లీ మొహం చూడలేదని, అధికారంలో లేకపోయినా తాను, ఎన్టీఆర్ మాత్రమే ప్రతిపక్ష నేతలుగా అసెంబ్లీలో కూర్చున్నామని వివరించారు. కాగా, ఉత్తరాఖండ్ మృతులకు, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రాంకు సదస్సు నివాళి అర్పించింది.

ఉత్తరాఖండ్ బాధితుల సహాయార్ధం తన కిడ్డీ బ్యాంకును అందజేసిన నగర శివార్లలోని గుండ్ల పోచంపల్లికి చెందిన అస్మితారెడ్డి అనే బాలికను చంద్రబాబు అభినందించారు. మల్కాజిగిరికి చెందిన రాధాకృష్ణ యాదవ్ రూ.లక్ష, ఎల్బీ నగర్‌కు చెందిన రవి శంకర్, రవికుమార్, అనిల్ చౌదరి కలిసి రూ.50 వేలు విరాళంగా అందచేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వివేకానంద ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ఐదు జిల్లాల పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు.