July 6, 2013

పంచాయతీలో సైకిల్‌దే జోరు

 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కళంకిత మంత్రులను కేబినెట్‌లో పెట్టుకున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కారుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు దండుకొని ఇంకొకాయన చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్క బెడుతున్నారని వైఎస్‌ జగన్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం నాడిక్కడ నగర శివారులోని కొంపల్లి సమీపంలో టీడీపీ ప్రాతీయ సదస్సు జరగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన ఈ సదస్సుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరై సభను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్థానిక సంస్థలను బలోపేతం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించక పోవడంతో కేంద్ర నిధులు వెనక్కి వెళ్లాయని ఆయన ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో తెలుగువారిని మానవతా దృక్పథంతో ఆదు కుంటే కాంగ్రెస్‌ నేతలు రాజ కీయం చేయా లని చూశారని బాబు వ్యాఖ్యానించారు. మనిషన్నాక మానవత్వం ఉండాలని, అది లేక పోతే మనిషే కాడని చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట ద్వారా కూడ డెహ్రాడూన్‌కు డాక్టర్ల బృందాన్ని పంపించి తెలుగువారికి వైద్య సేవలు అందజేశామన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో ధరలు ఆకాశంలో..
నిత్యావస సరుకుల నియంత్రణ బాధ్యతనుండి ప్రభుత్వం వైదొలగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పప్పులు, కూరలు ఏవీ కొనలేని పరిస్థితిని కాంగ్రెస్‌ సర్కారుతీసుకువచ్చిందన్నా రు.కిలో టమాట 60 నుండి 70 రూపాయలకు చేరుకుందని, సామాన్యూడి కష్టాలు సర్కారుకు పట్టడం లేదన్నారు. 9 సంవత్సరాల్లో పెట్రోలు 31 సార్లు, డీజిల్‌ ధరలను 24 సార్లు పెంచిన ఘనత యూపీఏ సర్కారుకు దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే 9 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తామని తాము చెబుతుంటే కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని, వారేమో గంట కూడా కోత లేకుండా ఇవ్వడం లేదని బాబు నిప్పులు చెరిగారు. జలయజ్ఞం ధనయజ్ఞం అయిందని తాము చెబుతూనే వస్తున్నా ప్రభుత్వం మేల్కొనడం లేదని, ఆఖరుకు కాగ్‌ కూడా సర్కారును కడిగేసిందని చంద్రబాబు అన్నారు. ఆ రోజు పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలు ఇచ్చి పల్లెలకు ప్రాధాన్యత ఇచ్చామని బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేసిందని, కనీసం కుర్చీలు, బల్లలు కూడా లేవని పేర్కొన్నారు. పంచాయతీల్లో పాలన పడకేసిందని, రాష్ట్రంలో సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు రుణాల మాఫీ..
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల ఉచిత కరెంట్‌, రైతుల ఋణాలను పూర్తిగా మీఫీ చేస్తాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధలోని కొంపల్లి ఎక్సలెన్సీ గార్డెన్‌లో తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యచరణ ప్రణాళిక తెలుగుదేశంపార్టీ కార్యకర్తల ప్రాంతీయ సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిదిగా హాజరయ్యారు. ఈ సభకు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌, మోత్కుపల్లి నర్సింలు, పి. రాములు, ఎస్‌. జైపాల్‌యాదవ్‌, ఉమామాధవరెడ్డి, రేవంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రంగారెడ్డిజిల్లా, మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలకు చెందిన అధ్యక్షులు, తెదెపా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దెత్తున పాల్గొన్నారు.