May 20, 2013

సాక్షితో జగన్ బ్లాక్‌మెయిల్!: బాబు


వైయస్‌పై నిప్పులు!
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ సొమ్ముతో దినపత్రిక, టివి ఛానల్ పెట్టి ప్రత్యర్థులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాబు ఆధ్వర్యంలో టిడిపి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం మధ్యాహ్నం కలిసింది. ఆ తర్వాత బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలోని కళంకిత మంత్రులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తాము రాష్ట్రపతిని కోరామన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. వైయస్ చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. గనులు, ఖనిజ సంపద, ఎస్‌ఈజెడ్ పేరుతో భూములను అన్యాక్రాంతం చేశారని ఆయన మండిపడ్డారు.

సిబిఐ తన ఛార్జీషీటులో రూ.43వేల కోట్ల అవినీతి జరిగిందని, ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తంలో నష్టం వచ్చిందని చెప్పిందన్నారు. నీకది నాకిది ద్వారా వైయస్ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అక్రమాలతో పేపర్, ఛానల్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, దేశ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని జగన్ పైన చంద్రబాబు మండిపడ్డారు.

వైయస్ అక్రమాల పైన టిడిపి వ్యాజ్యం వేస్తే కోర్టులు స్పందించాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి మంత్రులను కాపాడుతున్నారని ఆరోపించారు. మంత్రులు రాజీనామా చేసినా ఆయన ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.