May 20, 2013

‘మంత్రులనుతొలగించాలని రాష్ట్రపతినికోరాం’

 
న్యూఢిల్లీ : కళంకిత మంత్రులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి మంత్రులను కాపాడటంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరిక లేకుండా ఉన్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని మండిపడ్డారు. వైఎస్ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని ఆరోపించారు. వైఎస్ చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిలో అక్రమాలు జరిగాయన్నారు. గనులు, ఖనిజ సంపదను, ఎస్‌ఈజెడ్‌ల పేరుతో భూములను అన్యాక్రాంతం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ అవినీతిపై రాజా ఆప్ కరప్షన్ పేరుతో టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ ఉమ్మడిగా ప్రచురించిన పుస్తకాన్ని ప్రణబ్‌కు ఇచ్చామని తెలిపారు. వైఎస్ అక్రమాలపై టీడీపీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టులు స్పందించాయని పేర్కొన్నారు. అవినీతి సొమ్ముతో పత్రిక, టీవీ పెట్టి ప్రత్యర్థులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.