May 20, 2013

చిరు, జగన్‌లపై లోకేష్ విసుర్లు


కరీంనగర్/హైదరాబాద్: రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని నారా లోకేష్ సోమవారం అన్నారు. లోకేష్ కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 2004 వరకు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ముందుండేదని, ఇప్పుడు వెనుకబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే నేత కావాలన్నారు. ఆ సమర్థత చంద్రబాబుకే ఉందన్నారు. కార్యకర్తలు అందరికీ ఆదర్శంగా నిలువాలని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేయాలన్నారు. కలెక్షన్ కింగ్‌లను ఆదర్శంగా తీసుకుంటే సమాజారనికి అనర్థమేనని విమర్శించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత టిడిపి కార్యకర్తల పైనే ఉందని ఆయన చెప్పారు.

టిడిపి అధికారంలోకి రాగానే పంచరత్నాలు అమలు చేస్తామన్నారు. టిడిపికి పత్రిక, ఛానల్ లేవని, అవి ఉంటే మనమూ జైల్లోనే ఉంటామని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ, మద్యం గొలుసు దుకాణాలను రద్దు చేయిస్తామన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికి మంచి నీటిని సరఫరా చేస్తామని చెప్పారు.
అన్ని వర్గాలకు ప్రత్యేక డిక్లరేషన్, నిరుద్యోగ భృతి, యువతకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు.

సామాజిక సేవ, సామాజిక న్యాయం అన్న వాళ్లు సొంత సేవ, సొంత న్యాయం చూసుకొని వెళ్లిపోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని ఉద్దేశించి అన్నారు.