March 17, 2013

మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి

ఏలూరు:' తమ్ముళ్లు.. మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో, ఏ ఆటలు ఆడుతున్నారో అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈలలు వేసి సరిపెట్టుకుంటే కుదరదు. కష్టించి పని చేయండి, అవినీతికి వ్యతిరేకంగా పో రాడండి, పార్టీని గెలిపించండి'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రైతులను తెలుగుదేశం ఏనాడూ మోసం చేయలేదు, సాగునీటి సంఘాల ఎన్నికలు పెట్టాం, మద్దతు ధర కల్పించాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించాం, స్వయంగా నష్టపరిహారం అందిం చాం.

కానీ వై.ఎస్ కావాలని టీడీపీ మీద ద్రుష్పచారం చేశారని చంద్రబా బు ఆగ్రహం వ్యక్తం చేశారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగం గా 166వ రోజైన శనివారం ఆయన తణుకు సమీపంలో ఉన్న పైడిపర్రులో ఉంగుటూ రు, తణుకు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కష్టించి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇన్‌ఛార్జిలు కూడా కష్టపడి పనిచేయాల్సిందేనని అప్పుడే పార్టీకి మంచిరోజులు రావడమే కాకుండా మనం అధికారంలోకి రావడానికి వీలవుతుందని అన్నా రు. ఇంతకుముందు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిన సందర్భాల్లో వాళ్లకు ఏ సీట్లు ఇవ్వాలి, మనం ఏ సీట్లు మినహాయించుకోవాలి అనే చర్చలు సాగుతున్నప్పుడు పార్టీ అభ్యర్థుల ఖరారులో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు.

ఇన్‌చార్జిలు సైతం ఇప్పుడు మూలన కూర్చుంటే సరిపోదని, కష్టపడి పనిచేయాల్సిందేనని, చేయకపోతే మేమేమి చేయాలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని సున్నితంగా హెచ్చరించారు. కౌలు రైతులకు కూడా సరైన న్యాయం చేసేందుకు పార్టీ అన్ని చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. తల్లి కాం గ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 'మనం ఏం చేశామో ఇప్పటిదాకా, భవిష్యత్‌లో ఏమి చేయబోతున్నామో ప్రజలకు స్పష్టంగా వివరించాలి. అన్ని వర్గాల ప్రజలకు ఈ సమాచారం సంపూర్ణంగా అందాలి. అప్పుడే పార్టీకి అన్ని ఫలాలు దక్కుతాయని'' చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. మనం ఏ అవినీతి చేయలేదు. ప్రజల కోసం కష్టించి పనిచేస్తున్నాం.

అందుకే కష్టనష్టాలు కూర్చయినా సరే వస్తున్నా మీకోసం యాత్ర పేరిట నేను పాదయాత్ర చేస్తున్నాను అని వివరించారు. నేను ఒక పని అనుకున్నానంటే దానిని పూర్తి చేసి తీరుతాను. ఈ విషయంలో ఎప్పుడూ వెనకేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశా రు. కాంగ్రెస్ దుర్మార్గ రాజకీయాలను, దోపిడీ తనాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ అవినీతిని ప్రతి కార్యకర్త ప్రజల్లోకి పూర్తిగా తీసుకువెళ్లాలన్నారు. మనకున్న పరిధిలోనే పార్టీకి చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్నట్లు అభ్యర్థ్ధులను ఆరు నెలల ముందుగానే ప్రకటిస్తాను. పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే అన్నారు. సుమారు గంటన్నరపైగానే ఆయన ఈ రెండు నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో ఛలోక్తులు విసిరారు. మన వాళ్లు కొందరు మైకాసురుల్లా మారిపోయారని ఒకసారి, సెంటిమెంట్‌తో కొడుతున్నారని ఇంకోసారి చమత్కార బాణాలు సంధించారు. పార్టీ అంశాలను, గెలుపు ఆవశ్యకతను ఒకవైపు ప్రస్తావిస్తూనే ఇంకోవైపు చమక్కులు విసురుతుండటంతో సమీక్షలో అనేకమార్లు నవ్వుల పువ్వులు విరిసాయి.

తప్పులు సరిదిద్దుకోవాలి

: కార్యకర్తలు

ఇప్పుడు పార్టీలో కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల కార్యకర్తలు తమ అధినేత చంద్రబాబు ఎదుట స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రాణాలు అర్పించి అయినా సరే గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. పోలింగ్‌కు 22 రోజుల ముందు ఉంగుటూరు అభ్యర్థ్ధిని ఖరారు చేశారు. అయినా కూడా అక్కడ మనకి రెండోస్థానం లభించిందని ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్త శ్రీనివాస్ అన్నారు. మాకు కిరణ్ సీఎం కాదు, మీరే సీఎం, కరెంటు కష్టాలతో వేగలేకపోతున్నాం, కౌలు రైతులను ఆదుకోవాలని మందలపు సత్యనారాయణ కోరారు. కౌలు రైతులు తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయాలని రామకృష్ణ అనే మరో కార్యకర్త సూచించారు. మా రికార్డులన్నీ మీ దగ్గర ఉంటున్నాయంటున్నారు, కానీ ఉంగుటూరులో పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న మమ్మల్ని స్థానిక మంత్రి పీడించి పిప్పి చేస్తున్నారని పాతూరు విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీబీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో మనం ఓడిపోవాల్సి వచ్చిందని, అందుకే మా ఇన్‌ఛార్జికి మరింత బూస్ట్ అవసరమ న్నారు. పార్టీ రాజకీయాలు కలుషితంగా మారాయని కార్యకర్త అప్పలనాయుడు పేర్కొనగా డబ్బులకు ఆశపడిన వారే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లోకి వెళ్తారని నారాయణ అనే మరో కార్యకర్త పేర్కొన్నారు. ఇంతకుముందు మా నాన్న మమ్మల్ని బాగా చూసుకునేవారు, కావల్సినంత తిండిపెట్టేవారు. ఇప్పు డు నావరకు వచ్చేసరికి నా పిల్లలకు పప్పుచారు వేసి కూడా పెట్టలేకపోతున్నానని కార్యకర్త ఏసుబాబు కన్నీంటి పర్యంతమయ్యారు. డ్వాక్రా ప్రస్తుతం సర్వనాశనం అయినందని పుష్పాంజలి అనే మరో నేత ఆందోళన వ్యక్తం చేశా రు. ఉద్యోగాలు లేక యువకులు విలవిలలాడుతున్నారని తణుకు నియోజకవర్గ నేత నరిసింగ్ పేర్కొన్నారు. జగన్ వస్తే ఉప్పు కిలో వంద రూపాయలు అవుతుందని, రైతులకు నష్టాలు తప్పవని వీరవెంకట సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటాం, వై.టి.రాజాకు ఈసారి మంత్రి పదవి ఇవ్వాలని నందమూరి ప్రసాద్ కోరారు. కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని పాపాయమ్మ ఆందోళన వ్యక్తం చేయగా, ఇప్పుడిస్తున్న హామీలతో పాటు ప్రతీ కుటుంబానికి కొంత లబ్ధ్ది చేకూరేలా కార్యాచరణ చేయాలని సర్వారాయుడు విజ్ఞప్తి చేశారు.