March 17, 2013

అదను చూసి వదులుదాం!

టీడీపీ అమ్ముల పొదిలో అవిశ్వాసాస్త్రం

హైదరాబాద్ : టీఆర్ఎస్, వైసీపీల అవిశ్వాసంపై తటస్థ వైఖరి అవలంబించిన టీడీపీ.. టైమ్ చూసుకుని సర్కారుపై తానే సొంతంగా పంచ్ విసరాలని భావిస్తోంది. రాజకీయం గా తమకు అనుకూల సమయం ఏర్పడిందనే అంచనాకు రాగానే... సొంతంగా అవిశ్వాస్త్రం సంధించాలని యోచిస్తోంది. "సీమాంధ్ర, తెలంగాణల్లో మా గ్రాఫ్ పెరగడం మొదలైంది. గత మూడు నెలల్లోనే ప్రజల్లో మాకు ఆదరణ 6 శాతం వరకు పెరిగినట్లు మా సర్వేల్లో వెల్లడైంది. వచ్చే ఆరేడు నెలల్లో మరింత పెరిగే అవకాశముంది. ఆరేడు నెలలు గడిస్తే మేం సొంతంగా గెలవగలిగిన వాతావరణం నెలకొంటుందని మేం ఆశిస్తున్నాం' అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.

ఆ సమయం వచ్చిందనుకొన్నప్పుడు కిరణ్ సర్కారుపై సొంతంగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి సర్కారును దించాలన్నది టీడీపీ అంతర్గత వ్యూహంగా కనిపిస్తోంది. అదేసమయంలో.. గీత దాటిన వారిపై ఇప్పటికిప్పుడు వేటు వేసి, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలని కూడా టీడీపీ భావించడంలేదు. 'ఉప ఎన్నికలపై మాకు ఆసక్తి లేదు. తెస్తే అసెంబ్లీ ఎన్నికలే తెస్తాం. విప్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేస్తాంగానీ, వాటిపై అంత గట్టిగా వెంటపడకపోవచ్చు'' అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు.

మోత్కుపల్లిపై అభినందనల వర్షం
అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో చెలరేగిపోయిన పార్టీ శాసనసభాపక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులుపై శనివారం ఉదయం జరిగిన టెలీకాన్ఫరెన్సులో అభినందనల వర్షం కురిసింది. 'నర్సింహులూ శభాష్! అవినీతి పార్టీలపై మన పోరాటాన్ని అసెంబ్లీ వేదికగా ఒక మలుపు తిప్పావు. బెయిల్లు, బ్లాక్ మెయిల్ల కోసం మద్దతు ఇవ్వబోమని బలంగా చెప్పావు. నీకు నా అభినందనలు' అని చంద్రబాబు ఆయనతో అన్నారు. అసెంబ్లీలో ఇదే దూకుడు సాగించాలని పార్టీ సభ్యులకు సూచించారు. ఆ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా నర్సింహులుకు అభినందనలు చెప్పారు.