March 17, 2013

ఆధార్‌ని బియ్యానికి లింకుపెడితే ఖబడ్దార్

నగదు బదిలీని నగుబాటు చేయొద్దు
అవి మంచి పథకాలు
కానీ, పేదలకే చేరితేనే సార్థకత
పశ్చిమ యాత్రలో చంద్రబాబు వినతి

 ఏలూరు : "నగదు బదిలీని నకిలీ బదిలీ చేయొద్దు. రాష్ట్రంలో ఆధార్‌ను నగుబాటు చేయకండి'' అని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. రేషన్ కార్డుకు ఆధార్‌తో లింక్ పెట్టి.. కిలోకి 14-15 రూపాయలు లెక్కించి డబ్బులు పడేస్తే అవన్నీ మగవాళ్లు తాగడానికే సరిపోతాయని పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా కాకరపర్రు వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. నిడదవోలు నియోజకవర్గంలో ని తీపర్రు, ఉల్లంపర్రు, కానూరు మీదుగా 10.4 కిలోమీటర్లు నడిచారు. 'బెల్ట్‌షాపులు తీసేయండి. అంతా బాగుపడుతుంద'ని కాకరపర్రు గ్రామంలో ఓ మహిళ కోరగా, ఆమెను చంద్రబాబు అభినందించారు.

మార్గమధ్యలో పూలకొట్టు దగ్గరకు వెళ్లి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. దారి మధ్యలో కలిసిన వికలాంగుడిని పలకరించి భుజం తట్టారు. 'మేము గౌడ్లం. మా బతుకులు ఎలా ఉన్నాయో చెప్పడం ఒక ముక్కలో అయ్యేది కాదు, చాలా దారుణంగా ఉందయ్యా పరిస్థితి' అంటూ ఓ గీత కార్మికుడు గోడును వెళ్లబోసుకోగా ధైర్యం చెప్పారు. డ్వాక్రా మహిళలను కలుసుకొని ఊరి పరిస్థితులను విచారించారు. ఈ సందర్భంగా తీపర్రు, కానూరుల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తలపెట్టిన నకిలీ బదిలీ, ఆధార్‌ల నమోదుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

"ఆధార్‌లో తప్పులేదు.. తప్పుల తడకగా మాత్రం మారకూడదు. నగుబాటు అసలే కాకూడదు. పేదవాళ్లు ఎవరు, ఆస్తిపరులు ఎవరు, రైతులు ఎవరు, ఎవరు ప్రభుత్వ పథకాలకు లబ్ధిపొందాలి అని గణాంకాలు ఉండాలి. అవి లేకుండా అన్నింటికీ ఆధార్ లింక్ చేస్తామంటే ఎలా?'' అని ప్రశ్నించారు. తన ఆలోచనలు దుర్వినియోగం చేసే విధంగా నగదు బదిలీ పథకం రూపొందించారని, దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగపడకపోగా వారి నడ్డి విరిచే అవకాశమున్నదని చెప్పుకొచ్చారు. " ఇప్పటికే ర్రాష్టాన్ని కరెంటు కోతలతో గాఢాంధకారం చేశారు. చార్జీలు పెంచి ఇబ్బందులపాల్జేస్తున్నారు. దీనికితోడు ప్రజలకు ఉపయోగపడేవాటిని కూడా దారి తప్పించినా.. నకిలీ పథకాలుగా మార్చినా సహించబోం'' అని హెచ్చరించారు.

ఆధార్ కార్డుకు బియ్యంతో ముడిపెడితే వీపులు మాడిపోతాయన్నారు. అదేజరిగితే 'ఖబడ్దార్' అంటూ సర్కారును హెచ్చరించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలోనే తెలుగుదేశం భయపడలేదని, సోనియాకు తానసలు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. గ్రామాల్లో మద్యం సమస్య పెరగడానికి నిరుద్యోగమూ ఒక కారణమేనని అభిప్రాయపడ్డారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా ప్రకటించారు.