March 17, 2013

నూరు నిలోమీటర్లు వేల దీవెనలు

  ఏలూరు :'వస్తున్నా మీకోసం' యాత్రలో ఆదివారం రాత్రి చంద్రబాబు జిల్లాలో వంద కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. బహుదూరపు బాటసారి కానూరు దగ్గర సెంచరీని పూర్తి చేశారు. తొమ్మిది రోజులు 65 గ్రామాలు, 13 మండలాల మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో ఆయనకు వేలాది మంది జతకలిశారు. వందలాది మంది మహిళలు హారతులుపట్టారు. మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ తమ ఆకాంక్షను ఆయన ముందు వుంచారు.

అలుపెరుగని సైనికుడిగా చంద్రబాబు శారీరక ఇబ్బందులను తట్టుకుంటూనే మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు గడిచిన తొమ్మిది రోజులుగా పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆయన పాదయాత్ర పూర్తి చేసుకుని నిడదవోలు నియోజకవర్గంలో ఆదివారం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పెరవలి మండలం కానూరులో ఆయన వందో కిలోమీటరును జిల్లాలో అధిగమించారు.

దీనిపై కార్యకర్తలకు ఆయనకు సంఘీభావం వ్యక్తం చేస్తూ పెద్దసంఖ్యలో ఆయనతో జత కలిశారు. కాకరపర్రు దగ్గర నుంచి కానూరు వరకు మార్గం మధ్యాహ్నం నుంచి కిక్కిరిసిపోయింది. వందవ కిలోమీటరుకు చేరువవుతున్న బాబు పాదయాత్రకు మద్దతు పలుకుతూ ఆయన నడిచే బాటలో కార్యకర్తలు పూలుపరిచారు. మహిళలు మంగళహారతులుపట్టారు. ఆంజనేయస్వామి, సిద్ధి వినాయకస్వామి దేవాలయాల్లోకి తీసుకువెళ్లి ఆశీర్వచనాలు అందించారు.

వస్తున్నా మీకోసం పేరిట ఆయన హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే ఆయన ఈ నెల 9వ తేదీన ఉప్పుటేరు వంతెన మీదుగా కృష్ణా జిల్లాను దాటి పశ్చిమలో కాలిడారు. ఇక అక్కడి నుంచి మొదలుకుని వందో కిలోమీటరు కానూరు వరకు దారిపొడవునా జనమే. తమ అభిమాన నాయకుడిని కలుసుకునేందుకు కార్యకర్తలు, తమ కష్టాలను వెళ్లబోసుకోవడానికి స్థానికులు ఎక్కడలేని తాపత్రయం ప్రదర్శించారు.

చంద్రబాబు సైతం పశ్చిమయాత్రలో ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దీనికి ఆయనకు అడుగడుగునా లభిస్తున్న జనాదరణ ఒక ఎత్తయితే పార్టీ నాయకులు, కార్యకర్తలు దగ్గరుండి మరీ శ్రేణులను సమన్వయపరిచి ఈ యాత్రలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునర్నారు. ఒకరకంగా చెప్పాలంటే జిల్లాలో తెలుగుదేశం యంత్రాంగం యావత్తు గడిచిన తొమ్మిదిరోజులు ఆయన వెంటే ఉన్నారు. కన్వీనర్లు, పార్టీ ముఖ్యుల్లో అత్యధికులు ఆయన పాదయాత్రలో నిర్విరామంగా కొనసాగుతున్నారు. 'నేనేదో పదవి కోసం ఈ పాదయాత్ర చేయడం లేదు.

మీ కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు, వాటిని పారద్రోలేందుకే శరీరక కష్టాన్ని కూడా లెక్కచేయకుండా వస్తున్నాను' అంటూ ప్రజల ఆదరాభిమానాలను చంద్రబాబు కూడగట్టుకుంటూ వచ్చారు. దీనికి అనుగుణంగానే పశ్చిమవాసులు కూడా స్పందించారు. ఉండి, భీమవరం, పాలకొల్లు, తణుకు నియోజకవర్గాల్లో ఆయన యాత్రకు అపూర్వమైన ఆదరాభిమానాలు లభించాయి. దీంతో ఆయన యాత్ర ప్రతీరోజు ఆయన పాదయాత్ర చేసుకుంటూ తెల్లవారుజాము నాటికి ప్రతిరోజు రాత్రి బసకు చేరుకుంటున్నారు. ఉదయం పార్టీ సమీక్షలు, మధ్యాహ్నం నుంచి పాదయాత్రకు దిగుతున్న ఆయన ముందుకు సాగుతూనే వచ్చారు.

మార్గమధ్యలో ఆయనను వేలాది మంది కలుసుకున్నారు. తమ కష్టసుఖాలను ఆయన ఎదుట ఉంచారు. చంద్రబాబు అదే రీతిలో ప్రతిస్పందించారు. మన ప్రభుత్వం వస్తే మీ కష్టాలన్నీ తీరుస్తానంటూ భుజం తట్టి భరోసా ఇచ్చారు. ఇదే ఆయనపై ప్రజల్లో అభిమానం రెట్టింపు అయ్యేలా చేసింది. ఆయన పాదయాత్ర చేస్తున్న మార్గాల్లో వందలాది వినతులు చేతికి అందాయి. బహిరంగసభల్లో మాట్లాడుతున్నప్పుడు మైక్ అందుకున్నవారు తాము ఎలాంటి కష్టాలుపడుతున్నామో చంద్రబాబు ముందుంచుతున్నారు. రైతువారీ కుటుంబాలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో మీ కష్టాలు తీర్చేలా రుణమాఫీ చేస్తానని, మిమ్మల్ని రుణవిముక్తులుగా చూడాలన్నదే నా లక్ష్యమని చెప్పినప్పుడు కూడా లభించిన స్పందన సహజంగానే చంద్రబాబుతో పాటు పార్టీలో కూడా ఉత్సాహాన్ని రగిలించింది.

గడిచిన తొమ్మిదిరోజుల్లో ఆయన కాళ్లు నొప్పులతో, శారీరక బాధలతో ఇబ్బందులకు గురవుతున్నా ఎక్కడా కూడా పాదయాత్రను ఆపలేదు. ప్రజలను కలుసుకోవడం మానలేదు. పంటి బిగువున బాధను భరిస్తూనే మీ కష్టాలు తీర్చేందుకు ఇక ముందు పెద్దన్నయ్య పాత్ర పోషిస్తానంటూ పశ్చిమవాసులకు ఊరటనిస్తున్నారు.