March 17, 2013

జైలు' పార్టీతో కలవలేకే తటస్థం: తుమ్మల

హైదరాబాద్: "ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసే ఆయుధంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగిస్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం బేరసారాలకు ఉపయోగపడే సాధనంగా మాత్రం కాదు. కొనుగోళ్ళు, ఫిరాయింపులతో ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవడం.. అవినీతి సొమ్మును విరజిమ్మి రాష్ట్రాన్ని కలుషితం చేయడం 'చంచల్‌గూడ జైలు పార్టీ' లక్ష్యం. దానితో కలవలేకే తటస్థంగా ఉన్నాం'' అని టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

వైఎస్ అవినీతి కుంభకోణాలపై 2004 నుంచీ టీడీపీ రాజీలేని పోరాటం చేస్తోందని.. ఒకవైపు వాళ్ళతో పోరాటం చేస్తూ మరోవైపు వాళ్ళ అవిశ్వాసాన్ని బలపర్చలేమని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని పార్టీలన్నింటిని ఏకం చేసి కాంగ్రెస్‌ను కేంద్రంలో గద్దె దించిన ఘనత కూడా తమ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. "ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి అవిశ్వాసాన్ని వినియోగించుకోవాలని రాజ్యాంగ రచయితలు ఆశించారు. మేం దానికి కట్టుబడి ఉన్నాం'' అని తుమ్మల పేర్కొన్నారు.