January 24, 2013

అధర్మంపై యద్ధం చేస్తున్నా.. సహకరించండి..

నాది ధర్మ పోరాటం
వైఎస్‌ను నమ్ముకున్నవారు ఇప్పుడేమయ్యారు?
ఆయన కొడుకూ జైలు పాలయ్యాడు..
అవినీతి పట్ల ఉదాసీనత వద్దు
ఆడిన మాట తప్పను.. హామీలన్నీ అమలు చేస్తా..

"నాది ధర్మ పోరాటం. నీతి కోసం పోరాటం.. అధర్మంపై యుద్ధం చేస్తున్నాను. అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుందని నాకు తెలుసు. కొంతమంది నేను తినను.. మరెవరినీ తిననీయనన్న ఉద్దేశంతోనే అక్రమార్కులకు సహకరించి ఇప్పుడు జైళ్ల పాలయ్యారు. నా కొడుకును వాళ్ల అమ్మ బాగా చదివించింది. నాకెలాంటి స్వార్థం లేదు. నాపై విశ్వాసం ఉంచండి. ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళతాను'' అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

'వస్తున్నా.. మీకోసం'లో భాగంగా చంద్రబాబు బుధవారం కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో 114వ రోజు తన పాదయాత్ర కొనసాగించారు. పెనుగంచిప్రోలులోని శ్రీ సత్యసాయి ఫంక్షన్‌హాల్‌లో రాత్రి బస ముగించుకుని బుధవారం పాదయాత్రను బాబు ప్రారంభించారు. అనిగండ్లపాడులో ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు రెండు కిలోమీటర్ల దూరం ఎదురొచ్చి మరీ హారతులు ఇచ్చి తమ గ్రామంలోకి ఆహ్వానించారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన బాబు.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియాకు అండదండలు అందిస్తోందని విమర్శించారు. ప్రపంచ చరిత్రలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మోపిన విధంగా విద్యుత్ భారాన్ని మరెవ్వరూ మోపలేదని మండిపడ్డారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తే.. ఈ బాధలన్నింటిని తీర్చివేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగం - ఉపాధి అజెండాగా కృషి చేస్తానని అన్నారు. రుణమాఫీ అన్నది కష్టమని తెలిసినా.. మనసుంటే అనేక మార్గాలు ఉంటాయని, ఆడిన మాట తప్పేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

అనంతరం గుమ్మడిదుర్రులో జరిగిన మరో బహిరంగ సభలో అవినీతి అంశంపై మాట్లాడారు. తాను రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు పాలన సాగించానని, ఆ సమయంలో ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి అన్ని వ్యవస్థలను సక్రమంగా పని చేయించానని చెప్పారు. అలాంటి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడని చంద్రబాబు ఆరోపించారు. "చంద్రబాబు తినడు.. మిమ్మల్ని తిననీయడు అంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి పదే పదే చేసిన విషపు ప్రచారం వల్ల కొంతమంది ఆయనతో కలిసి వెళ్లారు.

ఫలితంగా నేడు అనుభవిస్తున్న పరిస్థితులను తలచుకుని వారు బాధపడుతున్నారు. సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల మూడు నెలల హయాంలో జరిగిన వ్యవహారాల వల్ల ఐఏఎస్ అధికారులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు జైళ్లకు వెళ్లారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా అధికారులు జైలు ఊచలు లెక్కపెట్టిన ఉదంతాలు లేవు. ఆఖరుకు రాజశేఖరరెడ్డి కుమారుడు కూడా జైలుకు పోయాడు'' అని విమర్శించారు. పరిపాలన అంటే ఇష్టానుసారం దోచుకోవటమేనా? అని ప్రశ్నించారు.

వైఎస్ జలయజ్ఞం గురించి ప్రకటించినప్పడు ధనయజ్ఞంగా మార్చవద్దని తాము పదేపదే హెచ్చరించామని, చివరికి అదే జరిగిందని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి అని, ఆయన యుగ పురుషుడని కొనియాడారు. అదే వైఎస్‌ను చూస్తే పిల్లలు అవినీతి తప్ప మరొకటి నేర్చుకోలేరని విమర్శించారు. అవినీతి పట్ల ఉదాసీనంగా ఉంటే భవిష్యత్తు తరాల జీవితాలు నాశనమౌతాయని బాబు హెచ్చరించారు.

అడుగడుగునా జననీరాజనం
చంద్రబాబుకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. పెనుగంచిప్రోలు నుంచి అనిగండ్లపాడు బయలుదేరిన బాబుకు మహిళలు రెండు కిలోమీటర్ల దూరం ఎదురేగి.. హారతులు పట్టి గ్రామంలోకి ఆహ్వానించారు. గుమ్మడిదుర్రు, రామిరెడ్డిపల్లి, కొండూరుల్లోనూ ప్రతి ఇంటిమీద, పిట్టగోడల మీద, రోడ ్ల కిరువైపులా నిలబడి అశేష జనవాహిని బాబుకు స్వాగతం పలికింది.