January 24, 2013

అక్షరాలా ధనయజ్ఞమే..

నిజం నిలకడ మీద తేలుతుందంటారు! ఇప్పుడు అదే జరుగుతోంది. మబ్బులు తొలగిపోతున్నాయి. వైఎస్ హయాంలో జరిగింది జలయజ్ఞం కాదని, ధనయజ్ఞమని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాము. ప్రజలకు ఆ విషయం ఇప్పుడు అర్థమవుతోంది. ధనయజ్ఞానికి సజీవ సాక్ష్యాలు ఎన్నో నా పాదయాత్రలో కనిపిస్తున్నాయి. మున్నేరుపై పోలంపల్లి వద్ద ఎనిమిదేళ్ల క్రితం వైఎస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 30 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు.

కానీ... ఆ రాయి ఇప్పటికీ అక్కడే, అలాగే ఉంది. తట్టెడు మట్టి ఎత్తి పోసిందిలేదు. కానీ, ఎనిమిది కోట్లు మాత్రం ఖర్చుపెట్టారు. అంటే, వారికి రావాల్సిన కమీషన్లు వారికి వచ్చేశాయి. రైతులకు మాత్రం నీళ్లు అందలేదు. మొత్తం జలయజ్ఞం పేరుమీద 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎనిమిది వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు.

డబ్బులు దండుకునేందుకు కాలువలు మాత్రం తవ్వి వదిలేస్తారు. ప్రాజెక్టులు కట్టకుండా వదిలేశారు. ఈ విషయాలన్నీ ప్రజలకు ఇప్పుడు తెలుస్తున్నాయి. వైఎస్ అపర భగీరథుడు కాదని, కేవలం ధన యజ్ఞం చేసిన నాయకుడనీ అర్థం చేసుకుంటున్నారు. జలయజ్ఞంకంటే నా హయాంలో నిర్మించిన చెక్ డ్యాములే ఎంతో పనికివచ్చాయని రైతులు అడుగడుగునా చెబుతున్నారు. ఇప్పుడు వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలు చెప్పుకొంటున్నారు.

'సమస్యలున్న వారు చేతులు పైకి ఎత్తండి' అనిగండ్లపాడు బహిరంగ సభలో చెప్పగానే... అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చేతులు ఎత్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతోకాదు... ఐదారు రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇన్ని సమస్యలు ఉండి కూడా ప్రతి గ్రామంలో నాకు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు.

గుమ్మడిదుర్రు అనే గ్రామంలో అయితే... నేను వాళ్ల ఊరికి ఎప్పుడు వస్తే అప్పుడు నా చేత ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ చేయించాలని ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ అన్నా, నేనన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా వారికి ఉన్న అభిమానం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. పాదయాత్రలో నేను ఎన్ని ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా... ప్రజల అభిమానం, ఆదరణే నన్ను ముందుకు నడిపిస్తోంది.