January 24, 2013

సీఎం కిరణ్‌కు చంద్రబాబు లేఖ

సాగర్ ఆయకట్టు పంటలను కాపాడండి

  నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో ఎదుగుదల దశలో ఉన్న పంటలకు అవసరమైన నీటిని విడుదల చేసి కాపాడాలని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కోరారు.  ఈ సందర్భంగా రైతుల కష్టాలను గమనించిన చంద్రబాబు ఎండిపోతున్న పంటలకు తక్షణం సాగునీటిని విడుదల చేయని పక్షంలో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఖమ్మం, నల్లగొండ, కృష్ణాజిల్లాల్లో సాగర్ ఎడమ కాల్వ కింద పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేశార న్నారు. పంటలు చేతికి వచ్చేలోగా పైర్లకు రెండు మూడు సార్లు నీటి తడులు పెట్టాల్సి ఉందని రైతులు తెలిపారన్నారు. రెండు మూడుసార్లు పంటలకు నీళ్లు అందించాల్సి ఉండగా, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు ప్రాంతాల్లోని పంటలు నీళ్లు ఎండిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు.

సాగునీరు వెంటనే విడుదల చేయకపోతే దాదాపు 7.5 లక్షల ఎక రాల్లో పంటలు నిలువునా ఎండిపోతాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ పంటలను కాపాడటానికి ఒక్క వ్యవసాయాధికారి గాని, సాగునీటి అధికారి గాని ఆ ప్రాంతాల్లో పర్యటించిన దాఖలాలు లేవన్నారు. ఈ పరిస్థితుల్లో తక్షణమే ఆప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించి పరిస్థితిని అంచనా వేయించాల్సిందిగా నీటిపారుదల శాఖ ఛీప్ ఇంజనీరుతో పాటుగా వ్యవసాయ శాఖ కమిషన ర్‌ను ఆదేశించాల్సిందిగా ఆయన సీఎంకు సూచించారు.

సాగర్ ఆయకట్టు కింద సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని, అవసరమైతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నీటిని కూడా వినియోగించాలని సూచించారు. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆయకట్టు పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని సీఎం కిరణ్‌కు రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.

బాబు లేఖకు ఖుర్షీద్ స్పందన
నార్వేలో శిక్షపడిన అనుపమ, చంద్రశేఖర్ దంపతుల విడుదలకు కృషి చేయాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాసిన లేఖకు... భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పందించారు. ఈ విషయంలో విదేశాంగ శాఖ అందించిన సహాయ సహకారాలను బాబుకు... సల్మాన్ వివరించారు. నార్వే సుప్రీంకోర్టులో ఈ కేసు ఉన్నందున తదుపరి తీర్పు కోసం వేచి ఉన్నామని ఖుర్షీద్ వివరించారు. చంద్రశేఖర్ దంపతుల కేసు విషయంలో తాను రాసిన లేఖకు కేంద్ర మంత్రి ఖుర్షీద్ స్పందించడంపై చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.