January 24, 2013

ఈ సర్కారు కంట్లో మిర్చి పడా!

'ఢిల్లీ' దారుణంతోనైనా ఆడపడుచులకు అభయం దొరుకుతుందనుకున్నాను. ఆ రేపిస్టు లకు ఉరిపడి.. ఆడబిడ్డల ఆక్రందనలకు తెరపడుతుందని ఆశపడ్డాను. కానీ, పేపర్లు తిరగేస్తుంటే బాధనిపిస్తోంది. రోజూ ఏదో మూలన అబలలపై అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు. అంత ఉద్యమం జరిగిన తరువాత కూడా వ్యవస్థలోనూ ప్రభుత్వంలోనూ ఏ మార్పూ లేదు. అదే ఆవేదన చిల్లకల్లులో ఉదయం నన్ను కలిసిన విద్యార్థినుల కళ్లలో సుళ్లు తిరిగింది. నిర్భయ ఉదంతం ఇంకా వారి మది నుంచి చెరిగిపోలేదు. ఆ ఘటన గుర్తుకొస్తేనే గుండెలు నీరయిపోతాయి.

"ఈ పాలనలో మాకు భద్రత ఎక్కడ సార్'' అని అడుగుతుంటే కళ్లలోని తడిని ప్రశ్నని చేసి సంధిస్తున్నారనిపించింది. అటువంటి వాళ్లెంతోమంది జగ్గయ్యపేట దారిలో నాకోసం ఎదురుచూడటం చూశాను. "అన్నా మీరు సీఎం కావాలి'' అని ఒకరు అభిమానం చూపితే, " మీరు మళ్లీ అధికారంలోకి వస్తే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా అన్నా '' అని మరో యువతి చెప్పుకొచ్చింది. వీళ్లను చూస్తుంటే అభద్రతలో ఉన్న తమకు ఒక అన్న దొరికాడన్న ఊరట పొందుతున్నారనిపిస్తోంది. తమవద్దకు నడిచొస్తున్న నాపై వాళ్లకెంత నమ్మకం!

చిల్లకల్లు దాటిన తరువాత కలిసిన సుబాబుల్ రైతులను పలకరించారు. మధ్య దళారుల వ ల్ల దోపిడికి గురవుతున్నామని వాపోయారు. ఇదంతా వర్షాభావ ప్రాంతం. "సుబాబుల్ కలిసి వస్తుందని పెద్దఎత్తున నాటాం. ఇప్పుడు ఫరవాలేదు గానీ, గతేడాది చేసిన అప్పులు ఎంతవరకు తీరతాయో చూడాలి. కాగితపు పరిశ్రమకు కాగితం కొరత వచ్చి ఇప్పుడు కాస్త ధర పలికింది గానీ, అప్పుడయితే తోటలూ నరుక్కోవాల్సి వచ్చింది.

సుబాబులనే కాదు..మిర్చి రైతులు కూడా కష్టాల ఘాటుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ మిర్చి పొలంలోకి వెళ్లినా తెగులున్న పంటే కంట పడుతోంది. మంచి దిగుబడి వస్తుందనుకున్న సమయంలో మాయదారి తెగులు తగులుకుందని ఆ రైతు కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఆయన 15 ఎకరాల్లో పంట వేశాడట. ఇప్పటిదాకా ఎనిమిది లక్షలు పోశాడట. మూడో తడికి నీళ్లు రాకపోవడంతో పంటంతా పోయింది. కుటుంబం అప్పులపాలైంది. ఇక ఆత్మహత్య తప్ప మరో దారి లేదని ఆ రైతు వాపోయాడు. ఈ సర్కారు కంట్లో మిర్చి పడా!