January 24, 2013

సమస్యలు వింటూ..హామీలస్తూ..

  పెనుగంచిప్రోలులో బస చేసిన చంద్రబాబు బుధవారం 10.35 గంటలకు తన పాదయాత్ర ప్రారంభించారు. సత్యసాయి ఫంక్షన్ హాల్ అండ్ గార్డెన్స్ నుంచి బయలు దేరిన ఆయనకు గార్డెన్ యజమానులు పోలేపల్లి పూర్ణచంద్రబాబు, మోహన్ పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జగ్గయ్యపేట, నందిగామ ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, తంగిరాల ప్రభాకరరావు, ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్, కేశినేని నానిలు బాబు బస చేసిన వాహనంలోనే చర్చలు జరిపి పాదయాత్రను ప్రారంభించారు.

దున్నపోతుకు మేత వేసి ఆవును పాలివ్వమంటే ఎలా... పాదయాత్రలో చంద్రబాబు జనంతో సరదాగా మాట్లాడుతూ ముందుకు సాగారు. పెనుగంచిప్రోలు - అనిగండ్లపాడు మధ్యలో యాత్రకు ఎదురైన బస్సులోని ప్రయాణికులు ఆయనకు అభివాదం చేశారు. అందులోని కొందరితో ముచ్చడించారు. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు భారీగా పెరిగాయని, మీరే మమ్ముల్ని కాపాడాలని బాబును కోరారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిస్కరిస్తానని హామీ ఇచ్చారు. కాదు ఇప్పడే ఏదో ఒకటి చేయండని బతిమాలాడారు. స్పందించిన బాబు, 'దున్నపోతుకు మేత వేసి ఆవును పాలివ్వమని' అడగడం న్యాయమా అంటూ నవ్వారు.

ఈ సారి నాకు ఓట్లు వేసి గెలిపించండి మీ బాధలు తీరుస్తానని చెప్పి ముందుకు సాగారు. విద్యార్థినితో మాటా మంతి అనిగండ్లపాడు సమీపంలో భవ్య అనే ఎంబీఏ విద్యార్థిని బాబును కలసి నమస్కరించింది. ఆమెను కుటుంబ ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కళాశాలలే ప్రస్తుతం మీ అందరికీ ఆసరా అయ్యాయన్నారు. ఎంబీఏ చదువుతున్నా ఉద్యోగ వస్తుందన్న భరోసా కనిపించడంలేదు. తన కన్నా ముందు చదివిన వారికే ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని చంద్రబాబుకు విన్నవిచ్చింది. స్పందించిన ఆయన అధైర్య పడవద్దని తాను అధికారంలోకి రాగానే చదువుకున్న వారందరికీ ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అనిగండ్లపాడు ఎలిమెంటరీ పాఠశాలలోకి వెళ్లి చిన్నారులతో ముచ్చటించి, అవినీతిపై విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం చంద్రబాబు చేశారు.