January 24, 2013

సెల్‌తో అవినీతిపై సమరశంఖం పూరించండి

కాంగ్రెస్‌ని కుళ్లబొడవండి!
సహకార ఎన్నికల్లో చిత్తుగా ఓడించండి
కాంగ్రెస్, వైసీపీలు 'మాఫీ'కి వ్యతిరేకం
మీ ఉద్యమం తిరుగుబాటు కావాలి
కృష్ణాజిల్లా పాదయాత్రలో బాబు పిలుపు

  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కుళ్లబొడవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. రానున్న సహకార ఎన్నికలలో ఆ పార్టీని గెలిపిస్తే రుణమాఫీని కూడా మింగేస్తారని హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మక్కపేట వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మక్కపేట, పెనుగంచిప్రోలులో జరిగిన బహిరంగ సభలకు జనం పోటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలకు వెళ్ళే సత్తాలేదని ఈ సందర్భంగాచంద్రబాబు దుయ్యబట్టారు.

పంచాయతీల కాలపరిమితి ముగిసినా, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్‌పీటీసీలకు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చే స్తూ వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతోనే సహకార ఎన్నికలకు ప్రభుత్వం వెళుతోందని విమర్శించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎట్టిపరిస్థితులలోను అవకాశం కల్పించవద్దని పదేపదే కోరారు. కాంగ్రెస్, వైసీపీలు రెండూ రుణమాఫీకి వ్యతిరేకమని చెప్పారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ ఫోన్ల నుంచి 5 ఎస్ఎంఎస్‌లు అవినీతి వ్యతిరేకత కోసం పంపిస్తే..ఒక ఉద్యమం ఊపందుకుంటుందని పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ మహిళ లేచి, 'మీ హయాంలో ఆడ పిల్ల పుడితే డబ్బులు డిపాజిట్ చేసే పథకం పునరుద్ధరించండి సార్'' అని కోరగా సానుకూలంగా స్పందించారు. రెండు రోజులో దీనిపై ఆలోచించి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఎంత డిపాజిట్ (అప్పట్లో రూ. ఐదువేలు) చేయవచ్చు, ఏ సమయంలో ఆ డబ్బు వారికి అందించాలని తదితర అంశాలను నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు.