January 24, 2013

మీ కోసం నేనున్నా..

63 ఏళ్ళ వయసులో విసుగు, విరామం, అలుపు లేకుండా 1800 కిలోమీటర్లు కాలి నడకన తమ చెంతకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనం అడుగడుగునా నీరాజనాలు పలికారు. అభిమానంతోనో, తమ కష్టాలకు ముగింపు పలకగలరన్న ఆశతోనో ఏ వూరు వెళ్ళినా.. ఊరు ఊరంతా ఆయనను చూడటానికి కదలి వస్తోంది. చంద్రబాబు ప్రసంగాలలో కొత్తగా చెప్పే అంశాలు తక్కువుగానే ఉంటున్నప్పటికీ, శ్రద్ధగా వింటున్నారు. పాదయాత్రలో ఆయన మరో 13 కిలోమీటర్లు తనఖాతాలో వేసుకున్నారు. చిల్లకల్లు ఆల్ సెయింట్స్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో సోమవారం రాత్రి బస చేసిన బాబు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు కొద్దిసేపు పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి సందేహాలను తీర్చారు. అనంతరం ఉదయం 11.45 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. తనకు సంఘీభావంగా తరలి వచ్చిన వేలాదిమంది గ్రామీణ ప్రజలతో కలిసి నడిచారు.

మధ్యమధ్యలో ఎండిన పొలాలను పరిశీలించారు. దారేపోయిన వారిని పలకరించారు. మార్గమధ్యంలో చుక్కనీరు లేక ఎండిపోయిన సాగర్ కాల్వను చూశారు. రైతుల కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. కరెంటు కథలు విన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక పడుతున్న ఇబ్బందుల గురించి ఆలకించారు. నేనున్నానని, అధైర్య పడవద్దని, తెలుగుదేశం అధికారంలోకి వస్తే... మీ కష్టాలన్నీ తీరతాయని భరోసా ఇచ్చారు. నాలుగు కిలోమీటర్లు నడిచి, సుమారు రెండున్నర గంటలకు మక్కపేట చేరారు. అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు.భోజన విరామం తర్వాత కొద్దిసేపు భోజనానికి ఆగారు. బస్సులోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4.30 గంటలకు మళ్ళీ నడక ప్రారంభించారు. మక్కపేట నుంచి ఐదు కిలోమీటర్లు ఉన్న పెనుగంచిప్రోలుకు పాదయాత్ర సాగింది. దారి పొడువునా ఎండిపోయి కనిపిస్తున్న పత్తి, మిరప చేలను చూసి, తెగుళ్ళు ఆశించి, పంటలు పోయి దిగాలుతో ఉన్న రైతన్నలకు ధైర్యం చెబుతూ, సాయం త్రం 7.30 గంటలకు పెనుగంచిప్రోలుకు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు. మేడలు, మిద్దెలు, పిట్టగోడలు ఎక్కి కూర్చున్న ప్రజలతో సంభాషించారు. విద్యుత్ సమస్యను ప్రజలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ హయాంలో విద్యుత్ పోయిన సమయాన్ని చూసి గడియారాలు మార్చుకునేంత నిక్కచ్చిగా కరెంటు తొమ్మిది గంటలు ఇచ్చేవాళ్ళమని ప్రస్తుత అసమర్థ ప్రభుత్వం రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వటం లేదని విమర్శించారు. భరించలేని విద్యుత్ బిల్లులను ప్రజల చేతిలో పెడుతున్నారని అన్నారు. అవినీతిపై ప్రజల నేరుగా చర్చించారు. బ్యాంకు రుణాలు చెల్లించవద్దని, తమ ప్రభుత్వం రాగానే రుణాలను మాఫీ చేస్తుందని మరోమారు హామీ ఇచ్చారు.

కిరణ్‌పైనా, కాంగ్రెస్‌పైనా నిప్పులు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా చంద్రబాబు ఘాటైన విమర్శలు చేశారు. కిరణ్ కిరికిరి ముఖ్యమంత్రి అని, అసమర్ధుడని, చేతకాని దద్దమ్మ అని, దొంగలను కాపాడటానికే ఉన్నాడని ఆయన చేసిన విమర్శలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే జగన్ అవినీతిని, వైఎస్ కాలంలో జరిగిన తప్పులను ఎత్తిచూపారు. నా వెంట వ స్తారా ? చివరగా పెనుగంచిప్రోలు సభలో ఈ వయసులో పాదయాత్రతో తాను పడుతున్న కష్టాలను గురించి చెబుతూ, మీరు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే.. ఇవేమీ నాకు పెద్ద కష్టంగా అనిపించటం లేదని చెప్పి వారిని ఆకట్టుకున్నారు. సభ ముగియగానే.. మీరంతా హాయిగా ఇళ ్ళకు వెళ్ళిపోతారు. నేను మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేయాలి.

మీకోసం వచ్చిన నాకు మద్దతుగా, సంఘీభావం తెలుపుతూ మీరంతా నా వెంట వస్తారా? అయితే చేతులు ఎత్తండి.. అంటూ వారిని ఉత్సాహ పరిచారు. వేలాది చేతులు పైకి లేవటంతో ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. అనంతరం పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని, సత్యసాయి ఫంక్షన్ హాల్‌లో రాత్రి బస చేసేందుకు వెళ్ళారు.