January 24, 2013

సమస్యలు...చటోక్తులు

స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ... చలోక్తులు విసురుతూ చంద్రబాబు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఆయన ప్రసంగ సరళిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కేవలం రాష్ట్రస్థాయి అంశాలపై మాట్లాడిన బాబు ఇపుడు స్థానిక సమస్యలనుస్పృశిస్తున్నారు. ప్రసంగం చివరలో తాను వెళ్లిన గ్రామాల్లో గుర్తించిన సమస్యలతో పాటు స్థానిక నాయకత్వం ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి సభలో ప్రస్తావించి ప్రజలను ఆకర్షిస్తున్నారు. సోమవారం రాత్రి జగ్గయ్యపేటలో నిర్వహించిన బహిరంగసభలోను,  మక్కపేట బహిరంగ సభలోను ఆయన స్థానిక సమస్యలను ప్రస్తావించారు. జగ్గయ్యపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ పాస్‌పుస్తకాల పక్కదోవ పట్టిన వ్యవహారాన్ని ప్రస్తావించి అవినీతిని సహించరాదని సూచించారు.

జగ్గయ్యపేటకు నేరుగా కృష్ణా జలాల అంశాన్ని ప్రస్తావిస్తూ కృష్ణా జిల్లాకు కృష్ణా నదినీటిని ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రతి గ్రామానికి అందచేస్తానని హామి ఇచ్చారు. మక్కపేటలో జరిగిన సభలో సమస్యల జాబితానే చదివారు. తెలుగుదేశం హయాంలో పూడిక తీసిన గ్రామంలోని చెరువుల పరిస్థితిని, ఇప్పటి పరిస్థితిని గుర్తు చేశారు. గ్రామంలో అంతర్గత రోడ్ల దుస్థితిని ప్రస్తావించారు.

మాస్ మషాలా... బాబు ప్రసంగం అంతా మాస్‌ను టార్గెట్ చేసుకొని సాగుతోంది. వైఎస్ తనయుడికి కట్టబెట్టిన లక్ష కోట్ల సొమ్ము గురించి అర్థమయ్యేరీతిలో వివరిస్తున్నారు. గ్రామంలో కోటి రూపాయలు చూసిన వారుండరని, వంద వందరూపాయల నోట్లు కట్టకడితే పదివేలు అవుతుందని, అలాంటివి పదైతే లక్ష అని, వంద అయితే కోటి అని, వాటిని గోనెసంచుల్లో కుడితే వెయ్యి లారీల అవుతుందంటూ వివరిస్తున్నారు.

ధాన్యం మూటలు తప్పితే డబ్బు సంచులు చూడని ప్రజలకు, జగన్ దోచుకొన్న డబ్బులో 2 లారీలు మీ గ్రామానికి పంపితే ఊరే మారిపోతుందంటూ ఆలోచనలో పడవేస్తున్నారు. కోటి సంతకాల సేకరణను ఎద్దేవా చేస్తూ గ్రామంలో ఎవరో హత్యచేస్తారని, అతను చేయలేదని వందమంది సంతకం చేస్తే నిర్ధోషి అవుతాడా అంటూ ఆకట్టు కొంటున్నారు. ఎవరైన మంచిపని చేయాలంటే ముందు తమకు నచ్చిన ప్రార్థన మందిరానికి వెళ్లి ప్రార్థిస్తారని, జగన్ పార్టీలో చేరేవారు మాత్రం జైలులో కొబ్బరికాయ కొట్టి చేరుతున్నార ంటూ ఎద్దేవా చేశారు. ఇలా ప్రజలకు అర్థమయ్యేలా, ఆకట్టు కొనేలా బాబు ప్రసంగిస్తున్నారు. మక్కపేటలో ప్రసంగం ఆపుతుంటే ఇంకా మాట్లాడాలని కార్యకర్తలు కోరితే, మరోసారి అంటూ వేదిక దిగారు.