January 24, 2013

చంద్రబాబు విసుర్లు

లక్ష కోట్లు దోచిన వైఎస్ఆర్ వైఎస్ఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచేసింది. రూ. వెయ్యి నోట్లు అయితే ఒక్కో గోనె సంచిలో రూ.కోటి పడుతుంది. మీరు ధాన్యం గోనె సంచులను చూసి ఉంటారు కానీ, డబ్బుల సంచులు చూసి ఉండరు. ఒక్కో లారీకి 100 గోనె సంచులు పడతాయి. అంటే లక్ష కోట్లకు 1000 లారీలు పడతాయన్నమాట ! అంటూ పిట్టకథ రూపంలో ప్రతి గ్రామంలో వల్లెవేస్తున్నారు. రెండు లారీలు ఇస్తే అందరి కష్టాలుతీరతాయి. అనడంతో ప్రజల నుంచి స్పందన లభించింది.బెల్ట్‌షాప్ తీసేస్తే తాగుడు తగ్గుతుంది తమ్ముళ్ళూ... కొంతమంది మిట్ట మధ్యాహ్నం ఫుటుగా తాగేస్తున్నారు. అప్పుల బాధల నుంచి తట్టుకోవటానికి ఒక పెగ్గుతో మొదలై.. క్వార్టర్, ఆ తర్వాత ఫుల్ వరకూ వెళ్ళింది. చీప్ లిక్కర్ రూ.20 ఉండేదానిని ప్రభుత్వం రూ. 100 విక్రయిస్తోంది. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా ? నేనో సభలో తాగి వచ్చిన ఒకరిని ప్రశ్నించా. తాగావా అని అడిగా? తాగానన్నాడు.

భార్య ను కొడుతున్నావా? తాగినప్పుడే అన్నాడు. తాగకుంటే చక్కగా చూసుకుంటున్నానన్నాడు. మరి తాగడం మానుకోవచ్చు కాదా? అంటే బెల్టు షాపులను కనుక రద్దు చేస్తే మీరు కోరినట్టు మద్యం తాగటం మానివేస్తాను అన్నాడు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత సంతకం చేసే రెండో ఫైల్ బెల్ట్ షాపుల రద్దే..కొంగ జపం.. ఒక చేపల చెరువులో కొంగ తలదించుకుని జపం చేస్తోంది. అందులోని చేపలు కొంగా.. కొంగా.. ఎందుకు జపం చేస్తున్నావు అని అడిగాయి. అందుకు సమాధానం ఇస్తూ నా బాధ అంతా మీ మీదనే అంటూ దీనంగా పలికింది. అయ్యో.. కొంగ గారు మా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాయో? అంటూ జాలి పడ్డాయి.

అది గ్రహించిన కొంగ.. ఈ చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయి. పక్కనే సమృద్ధిగా ఉన్న చెరువులో మిమ్మల్ని వేస్తాను అంటూ నమ్మబలికి చేపలను తన ముక్కుతో పట్టుకుని పక్కకు తీసుకెళ్లి చంపి తినేది. తమ్ముళ్ళూ.. మీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది. మీకు భ్రమలు కలిగిస్తూ గుది బండలు మోపుతోంది. అది గ్రహించండి అన్నారు. తొమ్మిదేళ్ల తన పాలనలో మిగులు విద్యుత్తు సాధిస్తే.. ఈ ప్రభుత్వం కరెంటు చార్జీల మోత మోగిస్తుంది. త్వరలో మరో రూ. 17 వేల కోట్లకు పెద్ద బాంబు వేయబోతున్నారు. ఇప్పటికైనా భ్రమలను వీడండి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి బయటపడే మార్గం ఉంది. టీడీపీకి అధికారం కట్టబెట్టండి.