December 15, 2012

చంద్రబాబుకు నీరాజనం..

నిర్మల్/ఖానాపూర్/కడెం/మామడ/సారంగాపూర్/నిర్మల్అర్బన్: గిరిజన అసెంబ్లీ స్థానమైన ఖానాపూర్‌లో వస్తున్నా... మీకోసం చంద్రబాబు పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. జిల్లాలో బాసర వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్రకు ఖానాపూర్‌లో ప్రభంజనం సృష్టించా రు. రాథోడ్ ఇలాకాగా పేరు పొందిన ఖానాపూర్ నియోజక వర్గంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. ఇప్పటి వరకు ముథోల్, నిర్మల్ నియోజక వర్గాల్లో కొనసాగిన పాదయాత్రకంటే భారీ సంఖ్యలోనే జనం తరలివచ్చి బాబుకు బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం ఎక్బాల్‌పూర్ నుంచి ప్రారంభమైన చంద్రబాబు యాత్రకు గిరిజనులు, లంబాడాలు, గోండులు, మథురలు, స్థానిక యువకులు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో గుస్సాడీ, కోలాటం, మథురల నృత్యాలు మరింత ఆకట్టుకున్నాయి. ఎంపీ రాథోడ్ రమేష్, ఆ యన సతీమణి సుమన్‌రాథోడ్‌లు తీవ్రకృషితో దాదాపు 40 వేల మంది బహిరంగ సభకు తరలివచ్చారు. గిరిజన మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.

జై చంద్రబాబు అంటూ యువత విక్టరీ మార్కును చూపిస్తూ చంద్రబాబును స్వాగతించారు. ఈ సందర్భంగా చంద్రబాబు గిరిజనులకు వరాల జల్లులు కురిపించారు. మైదాన ప్రాంత గిరిజనులకు సైతం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. రూ. 1.50 లక్షలతో గిరిజనులందరికి పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. దీంతో గిరిజనులు చ ప్పట్లతో చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. కనీవినీ ఎరుగని రీతిలో జిల్లాలో కొనసాగిన ఈ పాదయాత్రకు కేవలం ఖానాపూర్ నియోజక వర్గంలోనే అత్యంత ఆదరణ, ఆప్యాయత లభించినట్లు స్పష్టమవుతోంది.

ఎంపీ తనయుడు రితీష్ రాథోడ్ సైతం యువత సమీకరణలో కీలక భూమిక పోషించారు. అలాగే ఖానాపూర్‌లో పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ పర్యవేక్షించారు. చివరి రోజు బాదనకుర్తి వద్ద ఘనంగా వీడ్కోలు తెలిపి బాబు పాదయాత్రను విజయవంతం చేస్తామని ఎంపీ రాథోడ్ రమేష్, ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్‌లు పేర్కొన్నారు.