July 2, 2013

అతిగా తాగేవారికి డిస్కౌంట్ ఇవ్వండి

వస్త్ర దుకాణాల్లో డిస్కౌంట్ ఇచ్చినట్టుగా అధిక మద్యం వినియోగించే వినియోగదారులకు 10 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చే విధంగా జీవోలు ఇవ్వాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సూచించారు. ఆదివారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్యం పాలసీకి మించిన చెత్త పాలసీ మరొకటి లేదని విమర్శించారు. ఖజానాను నింపుకోవడంలో శ్రద్ధ తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదా? అని ప్రశ్నించారు. దశలవారీగా మద్యం అమ్మకాలు తగ్గిస్తామని చెప్పి అమ్మకాలు పెంచుతున్నారని విమర్శించారు. నూతన మద్య విధానంపై కాంగ్రెస్ చర్చ నిర్వహిస్తే హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పర్మిట్ రూంలకు అనుమతి ఇవ్వడం ద్వారా మరింతగా మద్యం బానిసలు పెరుగుతారని అన్నారు. నూతన మద్యం పాలసీని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతమంది మరణించారు? ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రికుల్లో ఎంత మంది మరణించారో ప్రకటించాలని టిడిపి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి తొమ్మిది వందల మంది మాత్రమే మరణించారని చెబుతున్నారని, ఉత్తరాఖండ్ స్పీకర్ పదివేల మందికి పైగా మరణించారని చెబుతున్నారని, రాష్ట్రం ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా చెబుతోందని విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వెళ్లి యాత్రీకుల కోసం విమానాలను ఏర్పాటు చేసిన తరువాత కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అన్నారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. కేంద్రంలో 13 మంది మంత్రులు ఉన్నా ఘోర విపత్తుపై కనీసం స్పందించలేదని విమర్శించారు. మరో రెండు పార్టీలు కనీసం స్పందించలేదని అన్నారు.