July 2, 2013

దేశభక్తి రగిలించాలి : చంద్రబాబు

యువతలో దేశభక్తి రగిలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించడంతోపాటు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛం దసంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గత నెల 24న శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన జవాను యాదయ్య కుటుంబాన్ని సోమవారం చంద్రబాబు పరామర్శించారు.

ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్వగ్రామం కూడా అయిన కొండారెడ్డిపల్లికి సహచర ఎమ్మెల్యేలు రాములు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఎర్రశేఖర్‌లతో వచ్చిన చంద్రబాబు అరగంట పాటు యాదయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు రెండు లక్షల రూపాయలను యాదయ్య సతీమణి సుమతమ్మకు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు నిబంధనల ప్రకారం అందజేసే సాయంతో పాటు అదనంగా రూ.10 లక్షలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్‌ట్రస్టు తరపున యాదయ్య ఇద్దరు పిల్లలనూ ఉచితంగా చదివిస్తామని ప్రకటించారు. అనంతరం చంద్రబాబు రేవంత్ కోరిక మేరకు ఆయన చదువుకున్న ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులు, గ్రామస్థుల విజప్తి మేరకు ఎంపీ లాడ్స్ నుంచి రెండు లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు