July 2, 2013

తెరాస, వైకాపాలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి రాష్ర్ట వ్యాప్తంగా పటిష్టమైన కేడర్ వుంది.

ఉద్యమ పార్టీ అయిన తెరాస, సెంటిమెంట్ మీద నడుస్తున్న వైకాపాకు పార్టీ పరంగా నిర్మాణం అట్టడుగుస్థాయిలో లేదు. వందేళ్ళ పైబడి చరిత్రగల కాంగ్రెస్‌కు బలమైన కేడర్ వుంది. అదే విధంగా ముప్పైఏళ్ళ ప్రస్తానంలో తెలుగుదేశం పార్టీ కూడా తనకంటూ సొంత బలగాన్ని అట్టడుగు స్థాయిలో కలిగివుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల సహజంగావున్న యాంటీ ఇన్‌కంబెన్సీ వల్ల ప్రధాన ప్రతిపక్షమైన తమకు స్థానిక ఎన్నికల్లో మేలు జరుగుతుందని టిడిపి విశ్వాసంతో వుంది. ఈ ఎన్నికల్లో ఏమాత్రం వెనుకబడినా దాని ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందనే భయంతో పంచాయతీ ఎన్నికలను తీవ్రంగానే పరిగణిస్తున్నారు. అందుకోసం ప్రాంతీయ సమావేశాలకు షెడ్యూలు ఖరారు చేశారు. హైదరాబాద్, వరంగల్, విశాఖ, గుంటూరు, తిరుపతిల్లో ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేసి, కార్యకర్తలకు కర్తవ్యబోధలు చేయాలని నిర్ణయించారు. ప్రతి సదస్సుకు కనీసం ఇరవై వేల మంది కార్యకర్తలను సమీకరించి, బలప్రదర్శన చేయడం ద్వారా ప్రజలలోపార్టీ ఇమేజ్ పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల చార్‌దామ్ బాధితులకు ప్రభుత్వం కంటే మెరుగ్గా బాధితులకు సహాయక చర్యలు అందించడంతో పాటు, పార్టీ పరంగా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి యాత్రికులను స్వస్థలాలకు చేర్చి మంచిపేరును తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు స్థానిక ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ఆధిక్యతను చాటుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్తోంది.