May 10, 2013

టీడీపీకి కడియం శ్రీహరి రాజీనామా

తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించడం లేదు
టీడీపీలో సమన్వయం లేదు : కడియం

: సీనియర్ నేత కడియం శ్రీహరి టీడీపీకి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న కడియం పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉన్నారు. గత రెండు రోజులుగా అనుచరులతో సమావేశమైన ఆయన వారి సలహా మేరకు పార్టీకి రాజీనామా చేసినట్లు శనివారం ఉదయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను టీడీపీ గుర్తించడం లేదని ఆరోపించారు.

ఈ అంశంపై అనుచరులతో చర్చించాకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కడియం తెలిపారు. పార్టీలు మారేవారికి, పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకు రెండు సార్లు పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదన్నారు. టీడీపీలో సమన్వయం లేదని, ఎవరికి వారే అనట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

పార్టీలో నలుగురు కలిసి పనిచేసే పరిస్థితి లేదని వాపోయారు. ఎఫ్‌డీఐ ఓటింగ్‌లో పాల్గొనని ఎంపీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ విషయంపై లేఖ ఇచ్చినా అనుకూలమని ఎక్కడా చెప్పలేదని దుయ్యబట్టారు. అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్‌ను వెనుకేసుకొచ్చిందని ఆరోపించారు.

రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కన్నా తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని కడియం స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, అయితే ఏ పార్టీలో చేరేది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.