May 10, 2013

నేర తీవ్రతవల్లే బెయిల్ రాలేదు: టీడీపీ

జగన్‌కు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాదరావు ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం అనంతపురం, నరసరావుపేటలలో వారు విలేకరులతో మాట్లాడారు. జగన్‌పై కేసుల తీవ్రతనుబట్టే ఆయనకు బెయిల్ రాలేదని పయ్యావుల స్పష్టం చేశారు. వ్యక్తికన్నా సమాజ శ్రేయస్సే ప్రధానమన్న ధర్మాసనం వ్యాఖ్య ఇందుకు నిదర్శమన్నారు.

జగన్‌ను అక్రమంగా కేసుల్లో ఇరికించారంటున్న వైసీపీ నేతలు, శ్రేణులకు ఈ వ్యాఖ్యలు చెంపపెట్టులాంటివన్నారు. వైసీపీ ఇప్పటికే తిరోగమనం బాటపట్టిందని, చుక్కాని లేని నావలా తయారైందని పేర్కొన్నారు. వర్గపోరు, కుమ్ములాటలు పెచ్చుమీరడంతో నిస్పృహ చెందిన ఆ పార్టీ నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారన్నారు.

అవినీతిలో జగన్ ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచాడని కోడెల విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరంలో ఆయన నిందితుడని, విచారణ పూర్తయ్యేవరకు బెయిల్‌కు రావద్దని సుప్రీం కోర్టు చెప్పటం హద్దుల్లేని జగన్ అవినీతికి నిదర్శనమన్నారు. బెయిల్ రాకుండా బాబు కుట్ర చేశారనడం వైసీపీ నేతల నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు.