May 10, 2013

టీడీపీ 'ఉక్కు' ఉద్యమం! 13న బయ్యారంలో ధర్నా: ఎర్రబెల్లి

హైదరాబాద్ : ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్‌తో ఈ నెల 13న ఖమ్మం జిల్లా బయ్యారంలో భారీ ధర్నా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఆ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు గురువారమిక్కడ ఈమేరకు ప్రకటించా రు. ధర్నాలో తెలంగాణలోని పార్టీ ప్రజా ప్రతినిధులంతా పాల్గొనాలని ఫోరం
నిర్ణయించిందన్నారు. ఈ నెల 13న ఉదయం హైదరాబాద్‌నుంచి బస్సులో బయ్యా రం వెళ్తామని చెప్పారు.

'బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు మొట్టమొదట డిమాండ్ చేసింది మేమే. మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా అక్కడకు వెళ్ళి ధర్నా నిర్వహించి బయ్యారంలోనే ఫ్యాక్టరీ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. బయ్యారంలో విలువైన ఇనుప ఖనిజం ఉంది. అక్కడే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.

అక్కడి ఖనిజాన్ని మరెక్కడికో తరలించే ఆలోచన చేయవద్దు. దానిని మేం సహించం. అక్కడ ఫ్యాక్టరీ పెట్టేవరకూ మా పోరాటం కొనసాగుతుంది' అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను విస్మరించిన ఏ ప్రభుత్వమూ మనలేదని హెచ్చరించారు.