March 3, 2013

వైఎస్ హయాంలో కోట్లు లూటీ..

ఆరోగ్యశ్రీ కాదు.. అవినీతి సిరి!
ఏజెన్సీ ముసుగులో నిలువు దోపిడీ
ఊరికి ఒక ఆపరేషన్ చేసి ఆర్భాటం..
పేదల ఆరోగ్యంతో చెలగాటం
ఆరోగ్య బీమా పథకం తెస్తామని హామీ



మచిలీపట్నం/పమిడిముక్కల, మార్చి 3 వైఎస్ హయాంలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ..'ప్రచార శ్రీ'గా మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. పేదలకు కార్పొరేట్ వైద్యం చేయిస్తామని చెప్పి, వారి ఆరోగ్యంతో చెలగాటమాడారని, కోట్లాది రూపాయలు దండుకున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రైతుల ముఖాముఖితలోనూ, అనంతరం జరిగిన బహిరంగ సభల్లోనూ ఆయన 'ఆరోగ్య శ్రీ' అమలు తీరును తీవ్రంగా ఆక్షేపించారు.

" ఆరోగ్యశ్రీ పేరుతో ఒక ఏజెన్సీ ప్రారంభించారు. గత ఏడేళ్లుగా దాని ద్వారా రూ.2,900 కోట్లు వ్యయం చేశారు. ఏజెన్సీతో లాలూచీ పడి కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దోచుకున్నారు. ఊరికొక ఆపరేషన్ చేసి పథకం బాగా పని చేస్తున్నదన్న అపోహ కల్పించారు. నిజమైన రోగుల్లో చాలామందిని గాలికి వదిలేశారు'' అని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పథకానికి దీటుగా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతానన్నారు. జ్వరం దగ్గర నుంచి అన్ని రోగాలను ఈ పథకం కిందకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేశామని, బడ్జెట్‌లో ఆరు శాతం నిధులు కేటాయించామని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు మూడున్నర శాతానికి మించి నిధులు కేటాయించడం లేదన్నారు. రాష్ట్రంలో 2,600 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరం కాగా, 1600 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ధర్మ పోరాటం చేస్తున్న తనను.. నాడు ఎన్టీరామారావును ఎలా ఆశీర్వదించారో అదేవిధంగానే నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. దొంగలు ముసుగేసుకుని తిరుగుతున్నారని, వారి మాటలను నమ్మవద్దన్నారు. " జైల్లో ఉన్న నాయకులను ఆదర్శంగా తీసుకుంటే మీ బిడ్డలు కూడా జైలు కు వెళతార''ని పేర్కొన్నారు. పంటలకు నీరు ఇవ్వకుండా కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏమొహం పెట్టుకుని శిస్తు వసూలు చేస్తోందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం కొరవడిందన్నారు. ఎస్సీ నాయకుడు బాలయోగికి స్పీకర్ పదవి ఇచ్చిన చరిత్ర టీడీపీకే దక్కిందని గుర్తుచేశారు.