March 4, 2013

గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం

మైదాన ప్రాంతాల్లో నివసించే గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆదివాసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల భవన్‌లో ట్రైబల్ సబ్‌ప్లాన్‌పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఎస్టీ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ఆమోదం తెలపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని అన్నారు.

ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ నిధులు దుర్వినియోగం కాకుండా సంఘాలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నేతలు తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఎం. శ్రీనివాస్, డి. వెంకటేశ్వరరావు, జగన్నాథం వాకిలయ్య, కె గురవయ్య తదితరులు ప్రసంగించారు. సమావేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించారు.