March 4, 2013

యాత్ర ఓకే.. నేతల సంతృప్తి

చంద్రబాబు నాయుడు 150 రోజులుగా చేస్తున్న పాదయాత్ర చూపుతున్న ప్రభావంపై తెలుగుదేశం పార్టీ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే తర్వాత పరిస్థితి చాలా మెరుగైందని, పార్టీ వాణి ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి పాదయాత్ర ఒక బలమైన సాధనంగా ఉపయోగపడిందన్న అంచనాలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. వంద రోజులతో ఆయన పాదయాత్ర ఆపేస్తే బాగుండేదన్న పార్టీ సీనియర్లు కూడా ఇప్పుడు కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నారు.

అక్టోబర్ 2న మొదలుపెట్టి.. బాబు ఇప్పటిదాకా రాయలసీమలోని రెండు జిల్లాలు, తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు, కోస్తాలో రెండు జిల్లాల్లో ఇప్పటివరకూ పర్యటించారు. ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన వంద రోజుల తర్వాత వచ్చిన సహకార ఎన్నికల్లో ఐదారు జిల్లాల్లో పార్టీ మంచి పనితీరు కనపర్చింది. రెండు జిల్లాల బ్యాంకులను కైవశం చేసుకొంది. 'బాబు పాదయాత్ర వల్ల వచ్చిన స్పందన దీనికి కొంత కారణం' అని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. ఆ పార్టీ సొంతంగా చేయిస్తున్న సర్వేల్లో పాదయాత్ర తర్వాత టీడీపీ వైపు మొగ్గు కొంత పెరిగిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.