March 4, 2013

రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేస్తా

పమిడిముక్కల ప్రజలుచెప్పిన సమస్యలకు పరిష్కారం చూపుతానని రాష్ట్రాభివృద్ధికోసం ప్రపంచ దేశాల నుండి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిచేసి తన నిజాయితీని నిరూపించుకుంటానని మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పమిడిముక్కలమండలం మంటాడ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సమస్యలవలయంలో ఉన్నారన్నారు. రాష్ట్రం అదోగతిలో ఉంది. అభివృద్ధి దిశగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చడానికి రాష్ట్రాభివృద్ధికోసం ఆగిపోయిన పెట్టుబడులు మళ్ళీ తీసుకువస్తానని చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో విద్యుత్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని ఫలితంగా ప్రజలపై రూ.32వేల కోట్ల భారంపడిందని చంద్రబాబు చెప్పారు.

ప్రజలు ఆర్థిక భారాన్ని మోస్తూ అష్టకష్టాలు పడుతున్నా సిగ్గుమాలిన ప్రభుత్వంపట్టించుకోవడం లేదన్నారు. మరో వైపు పరిశ్రమలు దివాళా తీసి నిరుద్యోగం పెచ్చుమీరుతున్నా ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం దురదృష్టకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. జరుగుతున్న దారుణాలు, ప్రజల కష్టాలు ప్రభుత్వ అసమర్థతను తెలియజెప్పేందుకు తాను వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్నట్లుచంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యల సుడిగుండంలో ఉన్నారని, శాంతి భద్రతలు క్షీనించి వైద్య సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయని చంద్రబాబు విమర్శించారు. తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు అధికారం కోసం కట్టుక«థలు చెబుతున్నాయని వారి చేతికి అధికారం వెళితే ఇళ్ళ పైకప్పులు కూడ మిగలవని చంద్రబాబు ఎద్దేవ చేశారు.

తన ప్రభుత్వం 2004 లో మిగులు బడ్జెట్‌లను, మిగులు కరెంట్‌ను అప్పగిస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ఖజానాను జగన్మోహరెడ్డికి దోచిపెట్టారన్నారు. ఇక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏమాత్రం జ్ఞానం తెలియని వ్యక్తని పేర్కొన్నారు. రైతులుకరెంట్ కష్టాలను ఎదుర్కొంటున్నారని, కరెం ట్ కోత వల్ల పొలాలకు వెళ్ళిన రైతులు నాలుగువేల మంది పాము కాటుకు, కరెంట్ షాకుకు మరణించారని చెప్పారు. జలయజ్ఞంపేరుతో రూ.80 వేల కోట్లు పనులు చేపట్టి అధిక శాతం దిగమిగ్గారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అందరిని మెప్పించే పరిపాలన అందిస్తానని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఐటీ రంగంలో రాష్ట్రానికి గుర్తింపు తెస్తా అంతర్జాతీయ స్థాయిలో ఐటీని అభివృద్ధిచేసి రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెస్తానని చంద్రబాబు నాయు డు అన్నారు. వెలమకాలనీ సమీపంలో చెన్నై (తమిళనాడు) నుంచి వచ్చిన ఆంధ్ర ఇంజనీర్‌లను ఉద్దేశించి చంద్రభాబు ప్రసంగించారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ప్రతిష్ఠాత్మాకంగా తీర్చిదిద్దానని చెప్పారు. తాను ప్రతి క్షణం యువత అభివృద్ధికోసం తపన పడ్డానన్నారు.ప్రస్తుతం రాష్ట్రం రౌడీలు, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల అ డ్డాగా మారిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఐటీ రంగ అభివృద్ధికి ఏపీ చిరునామాగా మార్చి 2020 విజన్‌తో రాష్ట్రాభివృద్ధిలో అగ్రగామిగా విరజిల్లే ప్రణాళికను తెస్తే కాంగ్రెస్ పార్టీ దానిని విచ్చిన్నం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబును కలసిన ఇంజనీరింగ్ ఉద్యోగులు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తేనే పూర్వపు వైభ వం సాధ్యమని పేర్కొన్నారు. పామ ర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జీ వర్ల రామయ్య, ఎంపీ కొనకళ్ళనారాయణరావు, ఎమ్మెల్సీ వై.వి.వి. రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.